Thursday 17 October 2019

కేసీఆర్‌ తీరుపై ప్రకృతి కూడా పగ పట్టింది : ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌


  • కేసీఆర్‌ తీరుపై ప్రకృతి కూడా పగ పట్టింది–శ్రవణ్‌
  • హుజూర్‌నగర్‌కు రావద్దనే ప్రకృతి ప్రకోపించింది..
  • హుజూర్‌నగర్‌ ప్రజలను దేవుడు రక్షిస్తున్నాడు..
  • ఇప్పటికైనా కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని వీడాలి
  • ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేయడంపై నిప్పులు ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌


హైదరాబాద్, అక్టోబర్‌ 17 హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గురువారం బహిరంగసభలో టీఆర్ఎస్‌ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనకు ప్రకృతి కూడా అడ్డుపడిందని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ అన్నారు. కుండపోతగా వర్షం కురవడం ద్వారా దేవుడు హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ను రావద్దని ఆదేశించాడని వ్యాఖ్యానించారు.

హుజూర్‌నగర్‌లో గురువారం శ్రవణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్‌ తీరు పట్ల ప్రకృతి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉందని, నిరంకుశ విధానాలకు ప్రకృతి ప్రకోపించిందని, అందుకే హుజూర్‌నగర్‌ బహిరంగసభకు కేసీఆర్‌ హెలికాఫ్టర్‌ ద్వారా కూడా రాలేనంతగా ప్రకృతి శపించిందన్నారు. దీని ఫలితంగాకే కేసీఆర్‌ బహిరంగసభను రద్దు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. ఈ విధంగా దేవుడే వాతావరణం రూపంలో వచ్చి కేసీఆర్‌ను అడ్డుకున్నాడని వ్యాఖ్యానించారు. అసత్యాలతో చేయని వాటిని కూడా చేశామంటూ తప్పుడు హామీలు ఇచ్చేందుకు కేసీఆర్‌ వస్తున్నాడని తెలుసుకునే దేవుడు అతి భారీ వర్షం రూపంలో అడ్డుకున్నాడని అన్నారు. ప్రభుత్వ నిర్వాకాలకు వ్యతిరేకంగా ప్రజలే కాదు దేవుడు కూడా ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.

భారీ వర్షాల ద్వారా దేవుడు ఇక్కడి ప్రజల్ని రక్షించాడని, రెండు సార్లు భారీ వర్షం కురవడంతో ఇక్కడి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని, కేసీఆర్‌ను రానీయకుండా చేసిన వరుణదేవుడిన్ని జనం సైతం కొనియాడుతున్నారని దాసోజు శ్రవణ్‌  చెప్పారు.  ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ నియంతలా పాలన సాగిస్తున్నారని, నిరుద్యోగుల ఆశల్ని అడియాశలు చేశారని, అందుకే కేసీఆర్‌ను హుజూర్‌నగర్‌ రాకుండా కుండపోత వర్షం ద్వారా దేవుడు మోకాలడ్డాడని ఆయన నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకేమీ పట్టనట్లుగా కేసీఆర్‌ పాలన సాగుతోందని, ఇది కోర్టు ధిక్కారం అవుతుందని, కేసీఆర్‌ నియంత అని చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదని ఆయన విమర్శించారు. పని చేసిన కాలానికి జీతాలు ఇవ్వకుండా ఆరీస్టీ ఉద్యోగులను దసరా పండుగ సమయంలో ఇబ్బందులకు గురిచేసిన పాపం ఊరికేపోదని వ్యాఖ్యానించారు. కే సీఆర్‌ పతనానికి  ఇదే నాంధి అని, కేసీఆర్‌ పతనం ప్రారంభం అయిందని, ప్రజలు అన్నీ మరిచిపోయి ఎప్పుడూ తమ వెంటే ఉంటారని భావించవద్దని హెచ్చరించారు. ప్రజల నుంచి గుణపాఠం కేసీఆర్‌కు ఉంటుదని శాపాలు పెట్టారు.

వినాశ కాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధులు వస్తాయని, అందే తెలుగులో ’వినాశకాలే విపరీతబుద్ధి..’ అనే  నానుడి ఉందని దాసోజు శ్రవణ్‌ గుర్తు చేశారు. ఇది అక్షరాలా కేసీఆర్‌కు వర్తిస్తుందని, ఇంతకాలం ప్రజలకు తప్పుడు హామీలిచ్చి మోసం చేశారని, ఎంతకాలమో జనాన్ని మోసం చేయలేరని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయని, ప్రజల నుంచి గట్టి గుణపాఠం తప్పుదని ఆయన హెచ్చరించారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఒకవేళ టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదారెడ్డి కనుక విజయం సాధిస్తే.. దుర్యోదన సభలో కౌరవుడు అవుతారని దాసోజు శ్రవణ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ మంత్రులకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకునే అవకాశం లేదంటే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. ఈనేపథ్యంలో సైదారెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందితే నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండదన్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న పద్మావతి రెడ్డిని గెలుపొందిస్తే ప్రజల వాణిని అసెంబ్లీలో గట్టిగా వినిపించేందుకు ఆస్కారం ఉంటుందని, ప్రజా సమస్యల్ని ఎత్తి చూపేందుకు ఆస్కారం ఇచ్చేలా ఆమెను గెలిపించాలని కోరారు.

ఎలాగైనా టీఆర్ఎస్‌ గెలుపొందాలని నానా తంటాలు పడుతోందని, పడరాని పాట్లు పడుతోందని, అడ్డదారులు తొక్కుతోందని శ్రవణ్‌ ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బుల్ని పారిస్తోందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ నుంచి గతంలో గెలిచిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేసిన పనులను మరిచిపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రులు, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు, బడులు వంటివి ఉత్తమ్‌ హయాంలోనే నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. అభివృద్ధి చేయని టీఆర్ఎస్‌కు ఓట్లు వేయవద్దని, మంత్రులకే సీఎం అందుబాటులో లేనప్పుడు టీఆర్ఎస్‌ గెలిచి ప్రజలకు ఏం చేస్తారని, కాంగ్రెస్‌ చేసిన పనుల్ని గుర్తుంచుకుని అన్నింటినీ బేరీజు వేసి ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలకు చివరి మూడు రోజుల్లో మద్యం, డబ్బు పంపిణీ కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుఓవాలని, దీనిపై కాంగ్రెస్‌ క్యాడర్‌ కూడా నిఘా పెట్టాలని దాసోజు శ్రవణ్‌ విజ్ఞప్తి చేశారు.  

No comments:

Post a Comment