Thursday 13 December 2018

ఈవిఎంల టాంపరింగ్ ద్వారానే టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచారన్న దాసోజుశ్రవణ్.

ఎన్నికల కమీషన్ పాలకవర్గానికి పాలేరుగా మారి,తోడుదొంగల్లా వ్యవహరించింది...  డాక్టర్ దాసోజు శ్రవణ్.  
22 లక్షలమంది ఓట్లు తొలగించి సారీ చెబితే సరిపోతుందాఅని ఈసికి సూటి ప్రశ్న
ఎన్నికల కమీషనర్ రజిత్ కుమార్ కు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించి వాస్తవాలు రాబట్టాలని డిమాండ్.
ఇలాంటి చర్యలకు పాల్పడితే గల్ఫ్ దేశాల్లో ఉరితీస్తారని ఘాటు వ్యాఖ్య
గ్రామాలల్లో తరిమికొట్టిన నేతలకు వేలల్లో ఓట్లెలా వస్తాయని ప్రశ్న,ఈవిఎంల టాంపరింగ్ ద్వారానే టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచారని ఆరోపణ.
పోలీసులే టీఆర్ఎస్ కార్యకర్తల్లా డబ్బులు పంచి రాజ్యాంగ రక్షకులే, రాజ్యాంగ భక్షకులుగా మారారని ఆరోపణ.
2019లో రాహుల్ గాంధీ దేశప్రదాని అవుతారని జోస్యం..ఎన్నికల్లో సహకరించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన శ్రవణ్



టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరిగేలా అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించిన రాష్ర్ట ఎన్నికల అధికారి రంజత్ కుమార్ ను బహిరంగంగా శిక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రవణ్ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్  పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగ బద్ద పదవిలో కొనసాగుతూ రాష్ర్టంలోని 22 లక్షల మంది ఓటర్లను తొలగించి కేవలం ఒక సారీ చెప్పి ఎలా తప్పించుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలు అక్రమ మార్గంలో లోపభూయిష్టంగా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్ధకే అర్ధం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికలకు తూట్లు పొడిచి అక్రమ మార్గంలో పాలక వర్గానికి పాలేరులుగా మారడం ఎన్నికల కమీషన్ రిమోట్ టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెట్టడం దారుణమన్నారు.
 ఎన్నికల కమీషనర్ రజిత్ కుమార్ కు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహిస్తే వాస్తవాలు బయటకొస్తాయని, గల్ఫ్ దేశాల్లో ఉరితీస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రవణ్
ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ కు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించాలన్నారు డాక్టర్ శ్రవణ్, గల్ఫ్ దేశాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారులను బహిరంగంగా ఉరితీస్తారన్నారు. బతికున్న వారిని చనిపోయినట్లు చిత్రీకరించి అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లను గంపగుత్తగా లక్షల్లో తొలగించారని మర్రిశశిధర్ రెడ్డి కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం లేకపోవడం అత్యంత దారుణమన్నారు. 22 లక్షల ఓట్లను తొలగించి ప్రజల కనీసహక్కును హరించే అధికారం, గుండెధైర్యం రజిత్ కుమార్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. తమ ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు బూత్ ల వద్ద భోరున విలపించిన తీరు ఎన్నికల కమీషన్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు.
పోలీసులే టీఆర్ఎస్ కార్యకర్తల్లా డబ్బులు పంచి రాజ్యాంగ రక్షకులే, రాజ్యాంగ భక్షకులుగా మారారని ఆరోపణ.
రక్షకుడే భక్షకుడిగా  మారిన చందంగా పోలీసులు వ్యవహించారని, గులాబీ కార్యకర్తల్లా గల్లీ, గల్లీల్లో మద్యం, డబ్బులు పంచినా ఎన్నికల కమీషన్ కళ్లూ నోరూ మూసుకుందన్నారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగ బద్దంగా కల్పించబడ్డ ఓటు హక్కు తొలగించే హక్కు ఎవరికి లేదన్నారు. బతికున్న వారందరిని చంపేసిన ఎన్నికల కమీషనర్ పై కఠిన  చర్యలు తీసుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు.
గ్రామాల్లో తరిమి కొట్టిన నాయకులకు వేలల్లో ఓట్లెలా వచ్చాయి
ఎన్నికల ముందు అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లితే ప్రజలు తిరగబడ్డారని. చాలాచోట్ల తరిమి కొట్టారని, కాని ఎన్నికల ఫలితాల్లో మాత్రం అందుకు భిన్నంగా వేలల్లో  మెజార్టీ రావడమేంటని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లకు ఎదురు తిరిగిన నేతలను గుర్తించి  తుమ్మల, జూపల్లి, జలగం, మదుసూదన చారి లాంటి వారిని ఎన్నికలో ఓడించేలా, తమకు అనుకూలమైన వారిని గెలిపించుకునేలా ఈవీఎంలతో మాయ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో కుట్ర చేసిన కేసీఆర్, ఈవిఎం లలో జరిగిన అక్రమాలను మరిచిపోయేలా ఏపీ సీఎం చంద్రబాబును బూచిగా చూపిస్తు, అందువల్లే కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల్లో ఓట్లు రాలేదని దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఈవీఎంలను దాచి ఉంచిన గదులకు చెందిన  సీసీ పుటేజీలను దమ్ముంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
అక్రమాలు జరిగాయని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపణ
ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని అనుమానంతో ఈ నెల 9, 11 తేదీల్లో వీవీప్యాట్ స్లీప్పులను కౌంటింగ్ చేయాలని ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందించ లేదన్నారు. రాష్ర్టంలో జరిగిన ఎన్నికలు మొత్తం మోసపూరితంగా, లోప భూయిష్టంగా జరిగాయని, ఇలా జరిగితే ప్రజాస్వామ్య మనుగడ ఎలా సాధ్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
2019 లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేసిన శ్రవణ్ దాసోజు
ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా  2019లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని శ్రవణ్ జోస్యం చెప్పారు. ఈవిఎంల కుట్రద్వారా ఇక్కడి ఎన్నికల్లో ప్రభుత్వాల్లోకి రాగలిగినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈవిఎం మిషన్ లో ఓట్లకు ఆర్వోఇచ్చిన ఓట్లలో భారీ  తేడా
ఆయా పోలింగ్ బూత్ లో పోల్ అయిన  సమాచారాన్ని 17 సీ ఫారం ద్వారా రిటర్నింగ్ అధికారి  ఏజెంట్లకు  సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అయితే ఈవీఎం మిషన్ లో చూపించిన ఓట్లకు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన రాత పూర్వక సమాధానానికి భారీ తేడా కనిపిస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ఇందుకోసం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని  పోలింగ్ బూత్ నెంబర్ 7లో 717 ఓట్లు కౌంటింగ్ జరగగా, రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) లిస్ట్ లో 819 అని చూపించారని తెలిపారు. అలాగే, బూత్ నెం. 11లో 328 ఓట్లు పోలవ్వగా ఆర్ఓ లిస్ట్ లో 327, బూత్ నెం. 19లో 711 కౌంటింగ్ కాగా, ఆర్ఓ లిస్ట్ లో 714 చూపించారని అనుమానం వ్యక్తం చేశారు. 94లో 640 కౌంటింగ్ జరగగా ఆర్ ఓ లిస్ట్ లో 630 నమోదు చేశారని వివరించారు. అలాగే, బూత్ నెం. 124లో 756 కౌంటింగ్ జరగగా, లిస్ట్ లో 746 చూపించారని తెలిపారు. బూత్ నెం. 156లో 599 ఓట్లు పోలవ్వగా 440 ఓట్లను ఆర్ఓ లిస్ట్ లో నమోదు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యపద్ధతిలో నిష్పక్షంగా జరగాల్సిన ఎన్నికలను అధికార పార్టికి లాభం జరిగేలా వ్యవహరించిన సీఈఓ రజత్ కుమార్ పై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్ధి అద్దంకి దయాకర్, అలంపూర్ మాజీ ఎమ్మేల్యే సంపత్ కుమార్, దేవరకద్ర ఎమ్మెల్యే అభ్యర్ధి డోకూరి పవన్ కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



No comments:

Post a Comment