Wednesday 8 May 2019

ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద గూడుపుఠాణి - ఏఐసీసీ జాతీయ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ శ్ర‌వ‌ణ్ దాసోజు


ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద గూడుపుఠాణి -  కాంగ్రెస్

హైద‌రాబాద్‌, మే 8: తెలంగాణ రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ సీట్ల‌కు నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల షెడ్యూల్‌ విష‌యంలో కుట్ర కోణం దాగి ఉంద‌ని పేర్కొంటూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు బుధ‌వారం కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) జాతీయ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ శ్ర‌వ‌ణ్ దాసోజు బుధ‌వారం ఢిల్లీలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాను ఢిల్లీలోని నిర్వాచ‌న్ స‌ద‌న్‌లో క‌లిసి ఈ మేర‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ, వివిధ కార‌ణాల వ‌ల్ల త‌మ ప‌ద‌వుల‌కు ముగ్గురు స‌భ్యులు రాజీనామా చేయ‌డం వ‌ల్ల డిసెంబ‌ర్ 2018లో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయ‌ని పేర్కొన్నారు. ఈ సీట్ల కోసం ఈ ఏడాది మార్చినెల‌లో జ‌రిగిన రెండు టీచ‌ర్లు మ‌రియు ఒక ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ సీట్ల‌తో కలిపి ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని, అయితే అలాంటి ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌న్నారు. కార‌ణాలు ఏవీ పేర్కొన‌కుండానే మార్చిలో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ఇప్ప‌టివ‌ర‌కు సాగ‌దీసి హ‌ఠాత్తుగా షెడ్యూల్ విడుద‌ల చేసి హుటాహుటిన ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించార‌ని శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు.

రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌ మ‌రియు వ‌రంగ‌ల్ జిల్లా స్థానిక సంస్థ‌ల‌కు చెందిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను 6వ తేదీ అర్ధ‌రాత్రి విడుద‌ల చేశార‌ని శ్ర‌వ‌ణ్ వెల్ల‌డించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో షెడ్యూల్ రూపొందించిన‌ట్లుగా వెనువెంట‌నే టీఆర్ఎస్ పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిందని శ్ర‌వ‌ణ్ ప్ర‌స్తావించారు. ఇలా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన స‌మ‌యం, టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల ఖ‌రారు సమయం దాదాపుగా ఒకటే కావడం అనేక అనుమానాల‌కు తావిస్తోంద‌ని, త‌ద్వారా ఎన్నికలు స్వేచ్ఛ‌గా మ‌రియు నిష్ప‌క్ష‌పాతంగా జ‌రుగుతాయ‌నే న‌మ్మ‌కాన్ని కోల్పోయాయ‌ని వెల్ల‌డించారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల‌కు ఓటు హ‌క్కు ఉంటుంద‌ని శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. అయితే, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. మే6వ తేదీన తొలి విడ‌త పోలింగ్ జ‌రిగింద‌ని, మే 10 మ‌రియు 14వ తేదీల్లో రెండో మ‌రియు మూడో విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంద‌ని వివ‌రించారు. ఫ‌లితాలు మే 27వ తేదీన వెలువ‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల జాబితా లేకుండా ఎన్నిక‌ల క‌మిష‌న్ మే 31వ తేదీన ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తుందని శ్ర‌వ‌ణ్ సూటిగా ప్ర‌శ్నించారు.

రాష్ట్ర శాస‌న‌మండ‌లి నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌ల‌లోని సెక్ష‌న్‌ 9.3 (iii) ప్ర‌కారం, ``మొత్తం గెలుపొందిన వారిలో క‌నీసం 10 %  లేదా ప‌ది మంది ఎన్నికైన వారిలో ఏది త‌క్కువ అయితే అది గుర్తింపు పొందిన పార్టీ త‌ర‌ఫున ప్ర‌తిపాదించ‌బ‌డాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల జాబితా లేకుండానే, స‌ద‌రు అభ్య‌ర్థి ఎలా ప్ర‌తిపాదించ‌బ‌డ‌తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ``ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను అబాసుపాలు చేసేందుకు తీసుకున్న నిర్ణ‌యం కాదా ఇది? హ‌ఠాత్తుగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం వెనుక‌ మ‌ర్మం ఇలా త‌ప్పుడు ప్ర‌క్రియ అవ‌లంభించేందుకేనా?`` అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛ‌గా, పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు తెలంగాణ సీఈఓ తీసుకుంటున్న తీవ్ర‌మైన త‌ప్పిద‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ఇదే అంశంపై ప్ర‌తిపక్షాల నేత‌లు తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ ర‌జ‌త్‌కుమార్‌ను క‌ల‌వ‌గా, పాత ఓట‌ర్ల జాబితాతోనే ఈ ఎన్నిక‌లు పూర్తి చేశామ‌ని వెల్ల‌డించార‌ని శ్ర‌వ‌ణ్ తెలిపారు. ``కొత్త ఎంపీటీసీలు మ‌రియు జెడ్పీటీసీలు మే 27వ తేదీన ఎన్నికైన‌ట్లు ధ్రువ‌ప‌త్రం పొందుతుండ‌గా...మ‌రోవైపు పాత జెడ్పీటీసీలు మ‌రియు ఎంపీటీసీల‌తో ఎన్నిక‌ల ఓట్లు వేయించ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డమే క‌దా? `` అని సూటిగా ప్ర‌శ్నించారు. దేశంలోనే తొలిసారిగా స‌రైన ఓట‌ర్ల జాబితా లేకుండా జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా ఈ ఎన్నిక‌లు నిలిచిపోతాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల గురించి తెలియ‌జెప్ప‌కుండా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌ను తెలంగాణ ఎన్నిక‌ల సీఈఓ పూర్తిగా త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు.






ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం గురించి టీఆర్ఎస్ పార్టీకి చెడు అభిప్రాయం ఉంద‌ని శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన గ్రాడ్యుయేట్ మ‌రియు టీచ‌ర్ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఘోర ప‌రాజ‌యం పాలైన నేప‌థ్యంలో, తిరిగి అలాంటి ఫ‌లితం రాకుండా ఉండేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మే6వ‌ తేదీ అర్ధ‌రాత్రి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యేలా వ్యూహం ప‌న్నార‌ని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జోక్యం చేసుకొని తెలంగాణలో ఎన్నిక‌లు స‌వ్యంగా జ‌రిగేందుకు చూసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇందుకోసం రెండు వారాల పాటు ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని కోరారు. సీఈసీ స‌హా ఇత‌ర క‌మిష‌న‌ర్లు ఈ విష‌యంలో స్పందించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చార‌ని శ్ర‌వ‌ణ్ వెల్ల‌డించారు.
కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ మ‌రియు టీజేఎస్‌కు చెందిన సీనియ‌ర్‌ నేత‌ల బృందం ఇప్ప‌టికే తెలంగాణ ఎన్నిక‌ల సీఈఓను క‌లిసి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రెండు వారాల పాటు పొడ‌గించాల‌ని, త‌ద్వారా కొత్త‌గా ఎన్నికైన ఎంపీటీసీలు మ‌రియు జెడ్పీటీస‌లీఉ ఎన్నిక‌ల్లో పాల్గొనే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని కోరింది.

No comments:

Post a Comment