Wednesday 19 June 2019

కొత్త పీఆర్‌సీ అమలు చేయాలి, ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌


కొత్త పీఆర్‌సీ అమలు చేయాలి, రాష్ట్ర సర్కార్‌కు కాంగ్రెస్‌ డిమాండ్‌
ఉద్యోగుల సమస్యలపై కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన శ్రవణ్‌
పీఆర్‌సీ, ఐఆర్‌లపై నిర్ణయం తీసుకోని క్యాబినెట్‌పై ఆగ్రహం


హైదరాబాద్, జూన్‌ 19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

కొత్త వేతన సవరణ పేస్కేల్‌ (పీఆర్‌సీ), మధ్యంతర భృతి (ఐఆర్‌), ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపువి అమలు చేయకపోవడం, ఉద్యోగుల హెల్త్‌ కార్డులు పనిచేయకపోవడం వంటి పలు ఉద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.  ఉద్యోగ సమస్యల గురించి అనేక సార్లు ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదో అర్ధం కావడం లేదు. ఈ అంశాలపై నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం వాటన్నింటినీ పక్కకు పెట్టడానికి కారణం ఏమిటో తెలియడం లేదు..అని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగులందరి సమస్యల్న పరిష్కరిస్తుందని 2018 మే 16న సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ అయిదో వేడుకల సందర్భంగా 2018 జూన్‌ 2న మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటిస్తామన్నారని, వారంలోగా కొత్త పీఆర్‌సీ నివేదిక వచ్చేలా ఆగస్టు 15న ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారని, ఏడాది కాలం గడిచిపోయినా ఇప్పటి వరకూ అ రెండు కీలక హామీలు అమలుకు నోచుకోలేదని శ్రవణ్‌ గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రివర్గం 2018 జూన్‌ 18న సమావేశమైంది. అయితే ఐఆర్‌ విషయంలోగానీ, కొత్త పీఆర్‌సీ అంశంపైగానీ క్యాబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం.  పైగా ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన ప్యాకేజీ అమలు చేస్తామంటూ మరో కొత్త హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఉద్యోగులను మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని, కొత్త హామీ కేవలం కంటి తుడుపు వంటిదేనని శ్రవణ్‌ అభివర్ణించారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆశల్ని ప్రభుత్వం మరింత నీరుగారుస్తోందని, దీని వల్ల ఉద్యోగుల పనితీరుపై ప్రతికూల ప్రభావం కనబడేలా కేసీఆర్‌ చర్యలున్నాయని అన్నారు. కరువు భత్యం కూడా సకాలంలో విడుదల కావడం లేదని, డీఏ ఈ ఏడాది జనవరి నుంచి విడుదల కాలేదని, అయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉద్యోగుల సంక్షేమం విషయంలో బాగా ముందుందని ఆయన చెప్పారు.  

పీఆర్‌సీ పెండింగ్‌లో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు మధ్యంతర భృతిని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎక్కువ శాతంలోనే విడుదల చేసేవని శ్రవణ్‌ గుర్తు చేశారు. అయితే టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఐఆర్, పీఆర్‌సీల చెల్లింపుల గడువు ఏనాడో ముగిసినా ఇప్పటి వరకూ అమలు చేయలేదని విమర్శించారు. ఈ జాప్యం ప్రభావం నాలుగు లక్షల ఉద్యోగులు, రెండున్నర లక్షల పెన్షనర్లపైనే కాకుండా వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఈ పరిస్థితులను కేసీఆర్‌ గుర్తించి 2018 జులై 1వ తేదీ నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ రాసిన బహిరంగ లేఖలో కేసీఆర్‌ను కోరారు.

పదవీ విరమణ వయసు పెంచితీరాలి..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, దేశంలోని 23 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉందని, తెలంగాణలో క్లాస్‌–4 ఉద్యోగులకు మాత్రమే ఆ విధంగా ఉందని, తెలంగాణ ఏర్పాటు జరిగాక ఏపీలో 2014 జూన్‌ నుంచి 60 ఏళ్ల వరకూ ప్రభుత్వ సేవలు అందించే వెలుసుబాటు ఉందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ చెప్పారు. ప్రాఫెషనల్‌ కాలేజీల్లో అధ్యాపకులు, న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏండ్లుగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మాత్రం 58 సంవత్సరాలుగానే కొనసాగించడం అన్యాయమన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఎన్నో ఎంతోకాలంగా పదవీ విరమణ వయసు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 1990 నుంచి ఉద్యోగ నియామక వయస్సును పెంచుతూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని, ఈ నేపథ్యంలో 1994, 1995ల్లో నియమితులైన ఉద్యోగులు కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకోకుండానే పదవీ విరమణ చేస్తున్నారని డాక్టర్‌ శ్రవణ్‌ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రజల సగటు ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో వారి సర్వీసుల్ని పెంచడం చాలా అవసరమన్నారు. అన్ని రాజకీయ పార్టీలన్నీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతామని ఎన్నికల్లో హామీలిచ్చాయని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్‌ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని శ్రవణ్‌ అన్నారు. పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు చాలా ఆందోళనలో ఉన్నారని, వారందరి కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

పనిచేయని హెల్త్‌ కార్డులు

ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌ కార్డును ఏ ఆస్పత్రిలోనూ గుర్తించి వైద్యసేవలు అందించడం లేదని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా నెలవారీ మెడికల్‌ బీమా కోసం డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికపరమైన ఏదో ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తోందని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల హెల్త్‌ కార్డులు పనిచేసేలా డబ్బు తీసుకోకుండా వైద్య అందించేలా ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పెరిగిన జిల్లాలు.. పెరగని ఉద్యోగులు.. పెను పనిభారం..

జిల్లాలు 10 నుంచి 33కు పెంచినప్పుడు కొత్త కార్యాలయాలు పెరిగాయేగానీ మినిస్టీరియల్‌ స్టాఫ్‌ను మాత్రం పెంచలేదని, దాంతో ఉద్యోగులపై అనూహ్యంగా పనిభారం పెరిగిందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ చెప్పారు. పని ఒత్తిడి కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, మండల, జిల్లాలకు అనుగుణంగా ఆయా జిల్లాల జనాభాను ఆధారంగా ప్రభుత్వం క్యాడర్‌ స్రెంత్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈవిధంగా చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. ఉద్యోగాలుఖాళీలుకొత్తగా అవసమైన ఉద్యోగాలు.. తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సర్వీస్‌ ట్రిబ్యునల్‌ తిరిగి ఏర్పాటు చేయాలి..

ఉద్యోగుల సమస్యలు, సర్వీస్‌ మేటర్‌ల వివాదాల్ని పరిష్కరించేందుకు దోహదపడే అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసిందని, అయితే తిరిగి ఆ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాలను రద్దు చేయాలని, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేసే చర్యలు తీసుకుని నిరుద్యోగుల ఆశల్లో వెలుగులు నింపాలని కోరారు. ఉద్యోగులు పదవీ విరమణ చేసే రోజునే గ్రాట్యుటీ, ఎరండ్‌ లీవ్‌ నగదుగా మార్పు, ఇతర సౌకర్యాలన్నీ పూర్తి స్థాయిలో Ðð ంటవెంటనే జరగాలని, అయితే రిటైర్‌ అయ్యే ఉద్యోగుల ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ మాత్రం అమలులో మానవత్వం లేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ పూర్తి చేసి నెలలు గడుస్తున్నా నేటికీ ఎంతో మంది తమకు రావాల్సిన బెనిఫిట్స్‌ కోసం నిరీక్షించాల్సివస్తోందన్నారు. ఈతరహాలో కాకుండా సమగ్ర విధానాన్ని అమలులోకి తెచ్చి పదవీ విరమణ చేసే వారికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తమ సమస్యల్ని పరిష్కరిస్తారేమోనని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులంతా కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని కోరుకుంటున్నారని, ఐఆర్, పీఆర్‌సీ వంటివి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మేరకు వీటన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలని శ్రవణ్‌ రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. 

No comments:

Post a Comment