Monday 6 May 2019

నల్సార్‌ వర్సిటీలో స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలి :ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

  • స్థానిక విద్యార్థులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ 
  • స్థానికులకు 20 శాతమే ఇవ్వడం అన్యాయం–85 శాతం అమలుకు డిమాండ్‌
  • బీసీలకు 29 శాతం కోటా అమలుకు సీఎం చర్యలు తీసుకోవాలి–శ్రవణ్‌


హైదరాబాద్, మే 6 : స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయించాలనే చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా వెనుకబడిన విద్యార్థులకు నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం రిజర్వేషన్లు అమలు చేయకుండా తీరని అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. 

హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో స్థానికులకు చట్టబద్ధంగా 85 శాతం సీట్లు ఇవ్వడానికి బదులు కేవలం 20 శాతమే ఇవ్వడం దారుణం. తెలంగాణ చట్ట నిబంధన ప్రకారం వెనుకబడిన తరగతుల వారికి 29 శాతం సీట్లను ఇవ్వాలన్న నిబంధన అమలు కావడం లేదు...అని న్యూదిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ చెప్పారు. తెలంగాణ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల నల్సార్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న తీరని అన్యాయం గురించి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ ప్రతిని ఆయన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ యాక్ట్‌ –1998 ప్రకారం ఏర్పడిన నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో చట్ట ప్రకారం స్థానిక విద్యార్థులకు, బీసీలకు చట్ట ప్రకారం సీట్ల కేటాయింపులు చేయకుండా దారుణమైన అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయిదేళ్ల బీఏ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం, సీహెచ్‌డి, ఎంబీఏ కోర్సుల్లో స్థానికులకు చెందాల్సిన చట్ట బద్ధ వాటా సీట్లు రావడం లేదన్నారు. దీనిపై అనేక సంస్థలు లేవనెత్తినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనంగానే ఉండిపోతోందని విమర్శించారు.

స్థానికులకు న్యాయం జరిగేలా అడ్మిషన్లు జరపాలన్న చట్ట నిబంధనల్ని నల్సార్‌ యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ వస్తోందని, యూజీసీ మార్గదర్శకాల్ని తుంగలోకి తొక్కిందని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఏ రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు జరిగే ఆయా రాష్ట్రాల చట్టాలను అమలు చేయాల్సివుందని, అయితే హైదరాబాద్‌లోని నల్సార్‌ మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ స్థానిక తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) – 2006 ప్రకారం గ్రాంట్లు తీసుకునే విద్యాసంస్థలు, డీమ్డ్‌ వర్సిటీలు, కాలేజీలు విధిగా ఆయా రాష్ట్రాల చట్టాలను అమలు చేయాలని తేల్చి చెబుతున్నా నల్సార్‌ మాత్రం వాటిని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర చట్ట నిబంధనల ప్రకారం తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోని 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించాలని, మొత్తం సీట్లలో 29 శాతం బీసీలకు చెందాలనే రూల్స్‌ను నల్సార్‌ అమలు చేయకుండా తీరని అన్యాయం చేస్తోందన్నారు.
రాజ్యాంగంలోని 371–డి అధికరణం, దాని తర్వాత వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 5లో (రిజర్వేషన్స్‌ ఇన్‌ నాన్‌ స్టేట్‌వైడ్‌ యూనివర్సిటీస్‌ అండ్‌ ఎడ్కుషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌) ఏయూ, ఓయూ, ఎస్వీ యూనివర్సిటీలు (రాష్ట్ర స్థాయి వర్సిటీలు కాని వాటిల్లో) రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిల్లోని అన్ని కోర్సుల్లో 85 శాతం సీట్లు స్థానికులు చెందుతాయన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం చూసినా కూడా నల్సార్‌ వర్సిటీలో కూడా 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందుతాయన్నారు. 

విశాఖపట్టణంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా విశ్వవిద్యాలయాన్ని (డీఎస్ఎన్ఎల్‌యూ) 2008లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, నల్సార్‌ తరహాలోనే దీనిని ఏర్పాటు చేశారని, విశాఖలోని డీఎస్ఎన్ఎల్‌యూ వర్సిటీలో స్థానికులకు, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంటే నల్సార్‌లో ఎందుకు అమలు చేయలేకపోతున్నామని ఆయన ప్రశ్నించారు. ఒకే చట్టం కింద, ఒకే తరహాలో ఏర్పడిన రెండు వేరువేరు వర్సిటీల్లో ఒకే విధమైన చట్టాన్ని అమలు చేయాలనే నిబంధన నల్సార్‌ మాత్రమే ఎందుకు అమలు చేయడం లేదన్నారు. 

నల్సార్‌ తరహాలో దేశంలో ఏర్పాటు అయిన పలు న్యాయ విశ్వవిద్యాలయాలు ఆయా రాష్ట్రాల్లోని చట్టాల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయని, బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇస్తున్నాయని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ వివరించారు. భోపాల్‌లోని నేషనల్‌ లా ఇ¯Œ స్టిట్యూట్‌ యూనివర్సిటీ, వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యుడిషియల్‌ సైన్సెస్‌ (కోల్‌కతా), నేషనల్‌ లా యూనివర్సిటీ (జో«ద్‌పూర్‌), హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ (రాయపూర్‌), డాక్టర్‌ రామ్‌ మనోహర్‌లోయా నేషనల్‌ లా యూనివర్సిటీ (లక్నో), గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ (గాంధీనగర్‌), చాణిక్య నేషనల్‌ లా యూనివర్సిటీ (పాట్నా), నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లా స్టడీస్‌ (కోచి), యూనివర్సిటీ ఆఫ్‌ లా (పాటియాలా), నేషనల్‌ లా యూనివర్సిటీ (కటక్‌), నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా (రాంచి), మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ (ముంబై), మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ (నాగ్‌పూర్‌), తమిళనాడు నేషనల్‌ లా స్కూల్‌ (శ్రీరంగం) తదితర న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఆయా రాష్ట్ర చట్టాలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని డాక్టర్‌ శ్రవణ్‌ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో వివరించారు.
నల్సార్‌ విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం నుంచి మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకూ ఏటా ఆర్థిక సాయం పొందుతోందని, స్థానిక విద్యార్థులకు, బీసీలకు సీట్ల కేటాయించాలన్న చట్ట నిబంధన అమలు చేసేందుకు కట్టబడి ఉండాలన్నారు. విద్యాపరంగా  నల్సార్‌కు స్వయంప్రతిపత్తి ఉండవచ్చునని, పాలనాపరంగా మాత్రం లేదని, చట్టాన్ని ఉల్లంఘించే అధికారం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు, వాటిలో బీసీలకు 29 శాతం సీట్లు అమలు చేయాలని, నల్సార్‌ వర్సిటీలో చట్టాన్ని అమలు చేసేందుకు సీఎం తక్షణమే చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ పట్టుబట్టారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే నల్సార్‌ విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారని, ఇక్కడే చట్ట ఉల్లంఘన జరగడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (సిఎల్ఎటి) ఈ నెల 26న జరుగుతుందని, ఈలోగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, సీఎం స్పందిస్తే తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు, బీసీలకు 29 శాతం సీట్లు లభించి లబ్ధి పొందుతారని డాక్టర్‌ శ్రవణ్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  

కేసీఆర్‌ కేరళ పర్యటనలో అర్ధం లేదు..



ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులతో కలిసి కేరళ పర్యటనకు వెళ్లడంలో అర్ధం లేదని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పర్యటన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెబుతూ.. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న లెఫ్ట్‌ పార్టీలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కేసీఆర్, కేరళ వెళ్లి అదే లెఫ్ట్‌ పార్టీలతో సహకారం కావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీయేతర నాయకులైన ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల సీఎంలు పట్నాయక్, మమతబెనర్జీలు కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను తోసిపుచ్చారని, ఇప్పుడు పూజల పేరుతో ఆయా రాష్ట్రాలకు వెళ్లి తిరిగి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌ 16 చోట్ల గెలుపొందుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. కారు.. పదహారు.. కేసీఆర్‌.. ఇవన్నీ నీటి మూటలే అవుతాయన్నారు.  


No comments:

Post a Comment