Saturday 4 August 2018

ఎంబీసీలుగా గుర్తిస్తూ 36 కులాల జాబితాతో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్.16, తక్షణం రద్దు చేయాలి: డా శ్రవణ్ దాసోజు


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,


దేశంలో మొదటిసారిగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే  స్వాగతించినం. అణగదొక్కబడ్డ కులాలకు న్యాయం జరుగుతుందని చాల సంతోషపడ్డాం. కానీ, ఎంబీసీ కార్పొరేషన్ కొరకు పలుమార్లు బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చుచేయక పొవడంతో మా ఆశలు అడియాసలైనాయి. 

ఆఖరికి, గత నాలుగు సంవత్సరాలుగా అసలు ఎంబీసీ లు ఎవరు, వారి సామజిక ఆర్ధిక స్థితిగతులు ఏమిటి అని తెలుసుకునే కనీస ప్రయత్నం చేయకుండా, రకమైన శాస్త్రీయ అధ్యయనం చేయకుండా తాత్సారం చేసిండ్రు. కానీ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అమాయక పేద కులాలని మభ్య పెట్టేందుకు, ఆగమేఘాలమీద, జీవో ఎంఎస్ 16, తేదీ 26.07.2018 ద్వారా మీరు ప్రకటించిన 36ఎంబీసీ కులాల జాబితా అసంపూర్ణంగానూ, అర్థరహితంగా  ఉండటంతో రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేదకులాలకు తీవ్రమైన ఆందోళన  కలిగిస్తోంది.

మీరు ప్రకటించిన 36 కులాల జాబితా లో ఉన్న కులాల జనాభా కేవలం 3 లక్షలు మాత్రమే ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం లో మొత్తం ఎంబీసీ సంఖ్య కేవలం 3 లక్షలు మాత్రమనేనా  మీ ప్రభుత్వ అభిప్రాయం. ఒకవేళ అదే నిజమైతే మీ అంచనాలు, ఆలోచనలు పూర్తిగా తప్పు, తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.   
            
రాష్ట్ర జనాభాలో 112 కులాలకు చెందిన 54 శాతం వెనుకబడిన జనాభా ఉన్నారు. అందులో దాదాపు మెజారిటీ కులాలు, అన్ని రంగాలలోనూ వెనుకబడి దారిద్ర్యరేఖకు దిగువన నలిగిపోతున్నారు. అసలు సమాజంలో ఒక పౌరుడికి ఉండే కనీస హక్కులు కూడా పొందకుండా,  సంచారజాతులుగా, దేశ ద్రిమ్మరులుగా, దినసరి కూలీలుగా, అత్యంత దయనీయమైన జీవితాలు గడుపుతుండ్రు. దాదాపు 34-35% జనాభా ఉన్న పేద కులాలగురించి మీరు పేరుకు ఒక కార్పొరేషన్  పెట్టి, వారి  సామాజిక ఆర్ధిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయకుండా కాలయాపన చేయడం, మా పేద కులాల పట్ల మీ ప్రభుత్వానికున్న శ్రద్ధ పాటిదో అర్ధం అవుతుంది. ప్రతిపాదికన మీ ప్రభుత్వం కేవలం 36 కులాలను మాత్రమే ఎంబీసీలు గా గుర్తించిందో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇటువంటి కీలక మైన బాధ్యత, రాజ్యాంగ సాధికారత ఉన్న బిసి కమిషన్ కు లేదా ప్రత్యేకంగా నియమింపబడ్డ ఒక  కమిటీ కి  బాధ్యత ఒప్ప చెప్పాలి. కానీ విచిత్రంగా  వారిని పక్కకు బెట్టి, చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్లు, నలుగురు వ్యక్తులు కలిసి ఒక  తప్పుడు జాబితాను  తయారుచేసి, అనేక మంది పేద కులాల  నోళ్ళలో మన్ను గొట్టిండ్రు.

ఎంబీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కు  మీరు ఛైర్మెన్ గా నియమించిన తాడూరి శ్రీనివాస్ సామాజికవర్గమైన కుమ్మరి కులం కూడా ఎంబీసీల జాబితాలో లేకపోవడం మీరు ప్రకటించిన జాబితా ఎంత లోపభూయిష్టమైనదో చెప్పడానికి, పేదకులాలపట్ల మీ ప్రభుత్వానికి ఉన్న ఉన్న నిర్లక్ష్య భావన కు ఇది ఒక మంచి ఉదాహరణ.

బిసి కమిషన్ కుల గణన కోసం, బీసీల స్థితిగతులపై అధ్యయనం కోసం 145 కోట్ల రూపాయలు కావాలని దాదాపు ఒక సంవత్సరం క్రితం ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను ఎందుకు మీరు బేఖాతరు చేసిండ్రు. స్వయంగా నేను వేసిన కేసు అధారంగా హైకోర్టు శాస్త్రీయంగా కులగణన చేయమని తీర్పు ఇచ్చినప్పటికీ, ఎందుకు ఇంకా మీన మేషాలు లెక్కపెడుతున్రు.

పిల్లలాట మాదిరిగా ఎంబీసీల జాబితా తాయారు చేసిండ్రనటానికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కొన్ని కులాలు  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లేరు. మీరు ప్రకటించిన కొన్ని కులాలకు చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియదు. ఉంటే ఎక్కడున్నారో, ఎంత మంది ఉన్నారో కూడా తెలియదు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలు పేద కులాల జాబితా తయారు చేసినప్పుడు, రాష్ట్రం లో ఉన్న అన్ని పేద కులాలకు  జాబితా లో సముచిత స్థానం లభించాలి.

కానీ అందుకు బిన్నంగా  ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన 11 కులాలకు కూడా ఎంబీసీల జాబితాలో చేరే అర్హత ఉన్నప్పటికీ, కేవలం వాటి కోసం ఫెడరేషన్లు ఉన్నాయన్న కుంటి  నెపంతో  కులాలను కూడా ఎంబీసీల జాబితాకు దూరం చేయడం ఘోర తప్పిదం. ఫెడరేషన్లకు మరియు కులాల జాబితాకు లింక్ పెట్టడం అంటే, మోకాలికి బోడ గుండుకు ముడిపెట్టినట్లే. అంతేకాకుండా, పేరు గొప్ప..  ఊరు  దిబ్బ అన్నట్లు గా, పేరుకు ఫెడరేషన్లు, నిధులు మాత్రం సున్న, నిధులు లేని ఫెడరేషన్లు ఉన్నా, లేకున్నా ఒకటే.

చాకలి, మంగలి, ఆరె కటిక, పెరికె, పద్మశాలి, బొందిలి, వడ్ల, కమ్మరి, కంచరి, అవుసలి, లింగాయత్, సాతాని, మాలి, దాసరి, పూసల, పట్కారీ, ఉప్పర కులాలతో పాటు  మరెన్నో చిన్న చిన్న కులాలు ఆదరణ, ఉపాధి అవకాశాలు లేక, దినసరి కూలీలుగా మారి దుర్భర  జీవితాన్ని అనుభవిస్తుండ్రు, అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండ్రు. కొత్తగా ఏర్పాటు చేసిన బీసి- కేటగిరిలో ఉన్న అత్తర్ సాహేబులు, ఫకీర్ లు, గారడీ ముస్లింలు, హజ్జామ్, లబ్బి దోబీ, తురక లక చెందిన అనేక మంది ముస్లిం లు అత్యంత వెనకపడ్డ నిరుపేద జీవితాన్ని కొనసాగిస్తున్న వారందరిని  ఎంబిసి జాబితాలలో పొందుపర్చక పోవడం  ఆయా కులాలకు శాశ్వతంగా అన్యాయం చేయడమే.

ఓపక్క, ప్రభుత్వం ఇంత ఘోర తప్పిదం చేస్తుంటే, బీసీల కోసం ఏర్పర్చిన ఎంబీసీ కార్పొరేషన్, రాజయంగా సాధికారత ఉన్న బిసి కమిషన్ కూడా నోరు మెదపక పోవడం బాధాకరం. తెలంగాణ బీసీ కమిషన్ కాస్త, తెరాస భజన కమిషన్ గా మారినట్లుంది.  రాజ్యాంగ బద్దమైన బీసీ కమిషన్ రాజకీయాలకు అతీతంగా వ్యహరించాల్సిన సభ్యులు, ప్రభుత్వ పెద్దలను కీర్తిస్తూ వివిధ పత్రికలలో ఆర్టికల్స్ రాయడంలో, తెరాస పెద్దల భజన చేయడంలో ఉన్న శ్రద్ధ, బీసీ పట్ల జరుగుతున్న ఇంత పెద్ద అన్యాయాన్ని సరిదిద్దలేకపోవడం పెద్ద నేరం.     

అంతేకాకుండా, ఇదే ఎంబిసి జాబితాలో మీరు అనాధలను కూడా చేర్చారు. తల్లితండ్రీ ఎవరో తెలియని, సమాజంలో మరే అండా ఆధారమూ లేని అనాధలను ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం గొప్పదే మరియు ప్రశంసింపదగ్గదే, కానీ వారిని ఎంబిసి కులాలలో చేర్చడం సరికాదు. దాంతో, నిజమైన పేద కులాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా తగ్గించేసినట్లే. అంచేత వారికోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి, వారికీ నిధులు కేటాయించి, వారిని విద్య, ఉపాధి రంగాలలో ప్రోత్సహించే విధంగా సంస్థాగతంగా ఆదుకుంటూ, ఆసరా కల్పించాలి  

జూన్ 2, 2014 నాడు, మీ ప్రమాణ స్వీకారం సందర్భంగా,  బీసీల అభివృద్ధి కోసం మీరు, 5 ఏళ్లలో 25 వే కోట్లను ఖర్చు చేస్తానని వాగ్దానం చేసి, కేవలం 2014 నుండి 2018 వరకు గత నాలుగు బడ్జెట్లలో మీరు కేవలం 13939 కోట్ల రూపాయల నిధులు కేటాయించి, ఖర్చుచేసింది మాత్రం కేవలం 58% (8108 కోట్ల రూపాయలు) మాత్రమే.  అమాయకత్వంతో కొట్టుమిట్టాడుతున్న బీసీల పట్ల వివక్ష న్యాయమా? అసలు బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ ఏమైంది?  అణగతొక్క పడ్డ బీసీలు, వాళ్ళ బతుకులు బాగుచేసుకోవడం కోసం, బీసీ కార్పొరేషన్ కు, బీసీ ఫెడరేషన్ కు, బీసీ కమిషన్ కు కలగల్పి దాదాపు 5 లక్షల 75 వేల మంది మీరిస్తానన్న బీసీ రుణాలకోసం పెట్టుకున్న దరఖాస్తుల అతి గతి ఏందో తెల్వది.

మొత్తం మీద, తెలంగాణ వస్తే బాగు పడుతాయి అనుకున్న బీసీల బతుకులు, పెనంల కెల్లి పొయ్యిల పడ్డంట్టుంది. అంచేత, బీసీలకు సమగ్ర న్యాయం చేసే విధంగా క్రింది డిమాండ్లను సానుకూలంగా అమలు చేయాలనీ విజ్ఞప్తి.... 
     ఎంబీసీలుగా గుర్తిస్తూ 36 కులాల జాబితాతో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్.16, తేది 26.07.2018ని తక్షణం  రద్దు చేయాలి..
     ఎంబీసీల సామజిక, ఆర్ధిక స్థితిగతులపై సమగ్రమైన శాస్త్రీయ అధ్యయనం చేసి, అర్హత కలిగిన పేద కులాలన్నింటిని ఎంబీసీ  జాబితా లో చేర్చాలి
     ఎంబీసీల జాబితాను తయారు చేసే బాధ్యత రాష్ట్ర బీసీ కమిషన్ కు  అప్పగించాలి, ప్రక్రియకు అవసరమైన నిధులు కేటాయించాలి.
     ప్రత్యేక ఫెడరేషన్లు ఉన్నప్పటికీ ఎంబీసీల జాబితాలో చేరడానికి అర్హత కలిగిన కులాలన్నింటినీ జాబితాలోకి చేర్చాలి.
     కుల గణన విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి
     బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
     బీసీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 5 లక్షల 75 వేల మందికి నిధుల కొరత అనే కుంటి  సాకు చూపకుండా, ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కలిగే విధంగా రుణం మంజూరు చేయాలి.

మీ ప్రభుత్వం విషయంగా సానుకూలంగా స్పందించని పక్షంలో మేము ప్రజాందోళనను చేపట్టడంతోపాటు, జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సిందిగా న్యాయస్థానం తలుపులుకూడా తడతామని తమరికి మా మనవి.

డా  శ్రవణ్ దాసోజు
ముఖ్య అధికారప్రతినిధి &  ప్రధాన కార్యదర్శి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

No comments:

Post a Comment