Tuesday 22 August 2017

కల్వకుంట్ల తారక రామారావు గారి ట్విట్టర్ పోస్టింగ్ కు, డిజిటల్ ఆర్మీ చేస్తున్న వికృత దాడికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ






కల్వకుంట్ల తారక రామారావు గారి ట్విట్టర్ పోస్టింగ్ కు,
డిజిటల్ ఆర్మీ చేస్తున్న వికృత దాడికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ప్రియమైన సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి..
మీతో పాటు, మీ భజన సంఘం సామాజిక మాధ్యమాల ద్వారా నాపై చేస్తున్న దాడికి ఇది నా స్పందన...
వయస్సుతో పాటు అనుభవం వస్తుంది.. వయస్సుతో పాటు ఆలోచనాశక్తి, పరిణితి (పరిపక్వత) వస్తుంది.. ఏండ్లు గడుస్తున్న కొద్దీ విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అప్పుడేమనం సంఘాన్ని..అందులోని వ్యక్తులను సరిగా అంచనా వేయగలుగుతాం...చివరకు మనిషికి విచక్షణ జ్ఞానం కలిగి ఉండడమే అన్ని సమస్యలనుంచి గెలిపిస్తుంది.
ఎంతో అంతర్మథనం..లోతైన పరిశీలన ..ఎదురీత తర్వాత లోపల దాగిఉన్న సోయి..విచక్షణ జ్ఞానం బయట పడుతాయి...అందులోంచి వచ్చిందే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ గుంపు యొక్క మోసపూరిత చర్యల గుర్తింపు..దీనికి నాయకత్వం వహిస్తున్న పెద్దమనిషి తనను నమ్మీ సర్వం త్యాగం చేసి వారిని అనుసరించిన వారిని ఎలా మోసగిస్తారో తెలుసుకున్నాను. పెద్దాయన మోసపూరిత వైఖరి తెలిసిన తర్వాత నాకు నేనే మీ నుండి దూరం జరిగాను. నేను తెరాస లోకి రావడానికి మీరు చేసిన ప్రయత్నాలు, చేసిన వాగ్ధానాల గురించి ఇప్పుడు నేను చెప్పదల్చుకోలేదు. సమయం వచ్చినప్పుడు చర్చిద్దాం.
కానీ నాకు సంబందించిన ఏదో ఒక పాత ఫోటొ..పాత్త వీడియోలను సోషియల్ మీడియాలో ప్రదర్శించి మీ నైరాశ్యాన్ని..మోసపూరిత చర్యలను మీ వక్రబుద్దిని చూపుతూ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే నీచ ప్రయత్నం చేస్తున్నారు..తద్వారా మీ అక్రమాలను వెలుగులోకి రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు.
చిట్ట చివరిగా సత్యం గెలుస్తుంది. కానీ అధికార మత్తులో తూగుతున్న మీకు, బయటి వ్యక్తుల ఆలోచనలు, ఫీలింగ్స్ తెలుసుకోలేని మూర్ఖులుగా, అంధులుగా మారిపోయారు. కానీ విచక్షణ శక్తి తో ప్రజలు మీ కుట్రలను, కుతంత్రాలను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
చర్చచేయడం..భావాలను వ్యక్తీకరించడం...ప్రజాస్వామ్య కనీస హక్కు..కానీ మీచే ప్రేరేపించబడ్డ కొందరు, ఎవరైనా ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ప్రజల సొమ్ముతో సెక్రటేరియట్ కేంద్రంగా, ముఖ్యమంత్రి ప్రగతిభవన్ ని వేదిక గా చేసుకుని డిజిటల్ జీతగాళ్లుగా మీ మెప్పుకోసం, సామాజిక మాధ్యమాల ద్వారా, జుగుప్సాకర పోస్టింగ్స్ పెడుతూ, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు..వీరీ ప్రవర్తన మీ సంకుచితమయిన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
అయితే, కేసీయార్ తో నాకున్న అనుబంధం తాలూకు జ్ఞాపకాలను, ఫోటోలను, వీడియో లను మీరు చాలా జాగ్రత్తగా దాచుకున్నందుకు చాలా సంతోషం... కాని మీరో ముఖ్యమైన విషయం మరిచిపోయినట్టున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో నేను మీనాయన గారిని బలపరిచేందు కు నేను చేసిన కృషి, తెలంగాణ సాధన కోసం నేను పడ్డ కష్టం కూడా గుర్తుపెట్టుకుంటే బాగుండేది.
అలాగే..కేసీయార్ గారు కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ తో కలిసి ఉన్నప్పడివి..అలాగే ఎన్టీయార్ చలువవల్ల కెసిఆర్ టీడీపీ లో నాయకుడి గా ఎదిగిన జ్ఞాపకాలు, తదుపరి కెసిఆర్ ను ఎమ్మెల్యే చేసిన ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడవటం లో భాగస్వామి అయిన గుర్తులు, , తదనంతరం, చంద్రబాబు టీడీపీ లో నాయకుడిగా చలామణి అవుతూ బెల్లి లలిత, మారోజు వీరన్న లాంటి తెలంగాణ పోరు బిడ్డలను బలి తీసుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు కెసిఆర్ వ్యహరించిన తీరుకు సంబందించిన జ్ఞాపకాలను పదిలం కూడా చేసుకున్నారా లేదా?
ఉద్యమ సమయంలో తలసాని తిట్లు, తుమ్మల దౌర్జన్యం, పటోళ్ల దాడులు, కొండా సురేఖ బూతులు, ఇంకా చాలా మంది చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు, అధికారం కోసం తెలంగాణ రాగానే మీ పంచన చేరిన తెలంగాణ ద్రోహులు, కాదు బంగారు తెలంగాణ బ్యాచ్ గతం లో ఏం మాట్లాడారో గుర్తున్నాయా?
అలాగే..ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ను ఆ దేవుడు కూడా కాపాడలేడంటూ కెసిఆర్ చేసిన కామెంటూ...దానికి పూర్తి బిన్నంగా అమరావతిలో చేపల పులుసు..రొయ్యలవేపుడు తో లంచ్ చేసిన సంఘటనల తాలూకు జ్ఞాపికలు ఉన్నాయా? లెవా? ఒక వేళ
ఇవన్ని మీవద్ద లేకపోతే, మీరేం కంగారు పడొద్దు వాటన్నింటి ని పంపడానికి సిద్దమేంగా ఉన్నాము..పంపమంటారా?
మీరు ఎవరిని ఫూల్స్ ని చేయదలుచుకున్నారు.. మీరు, మీ ప్రభుత్వం జనాన్ని ఒకటి..రెండు సార్లు ఫూల్స్ ని చేయగలరేమో కాని అన్నిసార్లు ఫూల్స్ చేయలేరు... మీ కుటుంబం చేస్తున్న దాష్టీకాలను ప్రజలంతా గమనిస్తున్నారు..మీకు త్వరలోనే సరైన గుణపాఠం చెప్పుతారు.
నేను చేసిన ఆరోపణలను మీరు ఎందుకు మీ డిజిటల్ జీతగాళ్లు, మరియు భజన బృందంతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారొ మాకు తెలుసు..కానీ మీకు నిజంగా సత్తా ఉంటే, సామాజిక మాధ్యమాలను వదిలి, ప్రజా క్షేత్రంలో బహిరంగచర్చకు సిద్దమా తెలపండి.
1. ఐసిఎఫ్ఏ అనేది ప్రైవేట్ సంస్ధ అవునా కాదా?...అది ఒక అనామక సంస్థ, మరియు విత్తనకంపెనీల కోసం ..లాబీయింగ్ చేసే సంస్థ. ఇలాంటి.మోసపూరిత సంస్థతో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధమేంటి..? ఇలాటి అనామక సంస్ధ ఇచ్చే అవార్డు కు ముఖ్యమంత్రి ఎలా అర్హుడవుతారు?
2. కెసిఆర్ ముఖ్యమంత్రిగా కాకుండా ఎకరానికి కోటి రూపాయలు సంపాదించే గొప్ప నైపుణ్యాలున్న వ్యక్తిగా, రైతుగా తాను వ్యక్తిగతంగా ఈ అవార్డు తీసుకుంటే మాకేలాంటి అభ్యంతరం లేదు. కాని వ్యవసాయ పాలసీ మేకర్ గా కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఈ అవార్డు తీసుకుంటే తప్పకుండా అభ్యంతరం వ్యక్తం ఛేస్తాం. అయన అర్హతను ప్రశ్నిస్తాం. 3500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా?. కరువు కాటకాలతో అల్లాడిపోయి, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుంటుంబాల ను ఆదుకోలేదు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించడం కూడా చాతకాలేదుమీకు. రైతులకు కనీస మద్దతు ధరలేదు..వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించమంటే... మిర్చి రైతులను రౌడీలుగా చిత్రీకరించారు..చేతులకు బేడీలేశారు..అన్నదాతను జైళ్లలో మగ్గపెట్టిండ్రు. ఇలాంటి చర్యలకు సిగ్గుపడాల్సింది పోయి..సిగ్గులేకుండా అవార్డు తీసుకుంటారా?
3. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి, దొడ్డి దారిన దొంగ చట్టాలను తెచ్చి, పేద రైతులను ఎదిరించి , బెదిరించి భూములు లాకుంటున్నది నిజామా కాదా? న్యాయం కోసం పేద రైతులు కోర్టుల కెళితే, వాళ్ళు తప్పు చేసినట్లు స్వార్ధ రాజకీయం కోసం డ్రామాలాడటం సమంజసమా?
4. గౌరవ గవర్నర్ గారికి నిజం దాచి కేంద్ర ప్రభుత్వం అవార్డు వచ్చిందని రాష్ట్ర మొదటి పౌరుడిని కూడా తప్పు దోవ పట్టించిన మీరు ఏం సంజాయిషీ ఇస్తారు?
5. ఐటీఐఆర్ విషయంలోమీ అసమర్ధత వల్ల రెండు లక్షల కోట్ల పెట్టుబడులు..50లక్షలు ఉద్యోగాలు కోల్పోలేదా.? కేవలం మీ తప్పుడు ప్రాధాన్యతల వల్ల ఐటీఐఆర్ వెనక్కు పోయింది?
6. ఇసుక మాఫియా పై చర్చిద్దాం సిద్దమేనా? పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక మైనింగ్ చేస్తోంది నిజం కాదా? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రిపోర్టు బయట పెట్టే దమ్ముందా?
7. నేరెళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన కు పాల్పడ్డ ఎస్పీ పై చర్యలు తీసుకోకుండా..ఒక ఎస్సైని బలిపశువును చేసి చేతులు దులుపుకున్నారు. పైగా ట్రైనింగ్ పేరిట ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పోలీస్ ఎస్ పి ని లఢఖ్ పంపిస్తారా? ఇదేనా మీకు చట్టం పట్ల రాజ్యాంగం పట్ల మీకున్న గౌరవం?
8. కోట్లాది రూపాయల ప్రజాధనం..వెంకయ్యనాయుడి గారి సన్మానాల పేరిట..రెడ్డి హాస్టల్ 10 ఎకరాల స్థలం కేటాయించి, 45 కోట్ల రూపాయలు పత్రిక ప్రకటనల కోసం, ఎలక్ట్రానిక్ మీడియా ప్రాచుర్యం కోసం ప్రజలు చెమటోడ్చి కట్టిన టాక్సుల ఖజానా నుండి ఖర్చు చేయడం తగునా? ఓ వైపు రెడ్డి కులంపై విషం కక్కుతూ మరోవైపు కుటిల ప్రేమ ప్రకటించడం మీ భావదారిద్రం కాదా?
9.మిషన్ భగీరథ..ఇసుక మైనింగ్, నీటి ప్రాజెక్టు ల పేరిట హద్దుల్లేని అవినీతి కి తెరలేపారు.
తెలంగాణ ఉంద్యమానికి నేతృత్వం వహించిన కెసిఆర్ పట్ల ఎల్లప్పుడూ గౌరవమే, కానీ తెలంగాణ వచ్చిన తరువాత దొంగలకు సద్దులు మోసినట్లు , తెరాస తెలంగాణ ద్రోహులకు కెసిఆర్ పట్టం కట్టిన తీరు, ఈరోజు ప్రజా ఖజానా ను అప్రాధాన్య అంశాలకు దుబారాగా ఖర్చు చేస్తున్న తీరు, ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు అన్నట్లు ఫత్వా లు జారీ చేసి, నియంత వలే పాలించడం, లెక్క పత్రం లేని దోపిడీకి పాల్పడటం గర్హనీయం. గత మూడు సంవత్సరాలలో రాసుకుంటే రామాయణమంతా, వింటే భారతమంత అన్నట్లు న్నవి మీ దాష్టీకాలు, మీ వైఫల్యాలు. మచ్చుకు మాత్రమే పైన కొన్ని తెల్పడమైంది.
మీ భజనబృందంతో డిజిటల్ జీతగాళ్లతో నాపై మీరు చేయిస్తున్న వికృత దాడితో మీ దిక్కుమాలిన..దిగజారిన దౌర్భాగ్య మానసిక స్థితి కనపడుతింది. మీ ఈ మానసిక స్థితి పట్ల నా సానుభూతిని తెలుపుతున్నాను.
నాపై మీరు రాయిస్తున్న రాతలు..అసభ్యకూతలలను మీ పింక్ మీడియాలో..నమస్తే తెలంగాణ పత్రిక లో ప్రచురిస్తూ గోబెల్స్ ప్రచారాన్నీ కొనసాగిస్తూ , మీరు ఒక శాడిస్టు వలే పైశాచిక ఆనందాన్ని పొందొచ్చు కానీ సమాజం పట్ల నాకున్న నిబద్దతను అడ్డుకోలేరు.
నేను ఉపాధి లేక రాజకీయాల్లోకి రాలే, ఉన్నత స్థాయి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. పేద బడుగు బలహీన వర్గాల గొంతు వినిపించేందుకే వచ్చాను. నేను కూడా ఉస్మానియా గడ్డ మీద విద్యార్థి ఉద్యమాలనుండి వచ్చిన ఒక బడుగు బిడ్డను. కాంగ్రెస్ పార్టీ గాని వక్తిగతంగా నేను గాని మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.
ఈన కాసినంక నక్కలా పాలైనట్లు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను, మరో కొత్తరకం దోపిడీ కి గురిచేస్తున్న తెరాస ప్రభుత్వ శక్తులను ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటాం. మీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతాం, మీ అవినీతిని ఎత్తి చూపుతాం. మీ మోస పూరిత విధానాలను ప్రశ్నిస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడేంతవరకు, నిరంకుశ పాలనకు దోపిడీకి చరమ గీతం పాడేంతవరకు మా పోరు ఆగదు.
.
తెలంగాణా అమరవీరుల స్థూపం వద్దకు...లేదా మీ ప్రగతి భవన్ వద్ద కా చెప్పండి ప్రజాస్వామ్య పద్దతిలో చర్చిద్దం..దమ్ముంటే రండి..
ఇట్లు
అభినందలతో
దాసోజు శ్రవణ్

No comments:

Post a Comment