Saturday 15 June 2019

ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లపై తెలంగాణ పోలీసుల కేసుల నమోదు దారుణం : ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్


ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లపై తెలంగాణ పోలీసుల కేసుల నమోదు దారుణం
మహిళల మిస్సింగ్‌ కేసులో కాంగ్రెస్‌ వాళ్లని కావాలని ఇరికిస్తున్నారు
యువజన కాంగ్రెస్‌ నేతపై కేసు ప్రాథమిక హక్కుల్ని తుంగలోకి తొక్కడమేశ్రవణ్‌ ధ్వజం
కేసుల్ని ఎత్తివేయాలని డీజీపీని కోరిన కాంగ్రెస్‌ నేతలు



హైదరాబాద్, జూన్‌ 15:తెలంగాణా రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే విధంగా టీఆర్ఎస్‌ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అదృశ్యంపై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టిన యువజన కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేశారని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసుల్ని యూత్‌ కాంగ్రెస్‌ వారిపై  పెట్టించిందని, రాజకీయంగా ఎదుర్కొనలేని దుస్థితిలో చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.  శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ మాట్లాడారు. బాలికల అదృశ్యం గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శితోపాటు పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఇంచార్జి వెంకట్‌ గురజాల మరో ఇద్దరిపై అన్యాయంగా కేసులు పెట్టారని, తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
తొలుత డాక్టర్‌ శ్రవణ్‌ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌లతో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి యువజన కాంగ్రెస్‌ నేతలపైన, సోషల్‌ మీడియా విభాగంలో పనిచేసే వారిపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈనాడు తెలుగు దినపత్రిక ఏమై పోతున్నారు’.. అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో... 548 మంది మహిళలు, ముఖ్యంగా ఎక్కువ మంది బాలికలు అదృశ్యమయ్యారని రాసిందని, ముఖ్యంగా గత పది రోజుల్లోనే ఈ మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లుగా ఆ కథనం సారాంశమని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ డీజీపీకి దృష్టికి తీసుకువచ్చారు. ఆ కథనంలోని వివరాలను ఆధారంగా చేసుకునే యూత్‌ కాంగ్రెస్‌ గ్రాఫిక్‌ డిజైన్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రభుత్వ, పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని ప్రశ్నించిందని తెలిపారు. ఈపోస్టింగ్‌లో ఎవరినీ రెచ్చగొట్టే అంశాలు లేవని, ప్రజల్ని చైతన్య పరిచే విధంగానే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే పోస్టింగ్‌ పెట్టారని అన్నారు.  అయితే సైబర్‌క్రైం పోలీసులు మాత్రం ఐపీసీ 505(1)(బి) సెక్షన్‌ కింద తమ పార్టీ వాళ్లపై మాత్రమే అన్యాయంగా కేసు నమోదు చేశారని విమర్శించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన గ్రాఫిక్‌ డిజైన్‌ ఎవరికీ వ్యతిరేకంగా లేదని, వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేసేలానే ఉందని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ గట్టిగా నొక్కి చెప్పారు.పైగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ పోస్టింగ్‌ దోహదపడేలానే ఉందని, ఎలాంటి నేరాలు జురగకుండా అప్రమత్తం చేసేలా ఉందన్నారు.
గ్రాఫిక్‌ డిజైన్‌ పూర్తిగా ఈనాడు పత్రికల్లో వచ్చిన వార్తాకథనానికి ప్రతిరూపమని, మహిళలు ముఖ్యంగా బాలిక అదృశ్యం, కిడ్నాప్‌లు వంటి సమాచారం పత్రికలు ప్రచురించినప్పుడు బాధ్యత గల జాతీయ స్థాయి పార్టీగా స్పందించడం కాంగ్రెస్‌ బాధ్యతని చెప్పారు. పోలీసుల బాద్యతను కూడా వెంకట్‌ గురజాల గుర్తు చేశారని, దీనిని తప్పుపట్టుకోవాల్సిన  అవసరంగానీ, కేసు నమోదు చేయాల్సిందిగానీ ఏమీ లేకపోయినా తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. మహిళలు, బాలికల మిస్సింగ్‌ గురించి కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించడమే నేరమని భావిస్తే.. అదే మిస్సింగ్‌లపై కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై ఎందుకు కేసు నమోదు చేయలేదని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు.
ఇలాంటి దారుణాలకు ప్రభుత్వం, పోలీసులు తెరతీయడం ద్వారా తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అయిందని విమర్శించారు.  వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు అదే అంశంపై కథనాన్ని ప్రచురించిన ఈనాడు పత్రికపై ఎందుకు కేసు పెట్టలేదని దాసోజు నిలదీశారు. స్వయంగా డీజీపీ కూడా 545 మంది బాలికలు అదృశ్యమయ్యారు.. సుమారు 300  మంది ఆచూకీ తెలియాల్సివుంది., అని డీజీపీ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 116 మంది వ్యక్తుల మిస్సింగ్‌ అయినట్లుగా కేసులు నమోదు అయ్యాయి. వారిలో 83 మంది ఆచూకీ తెలియాల్సివుంది., హైదరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో వంద మంది మిస్సింగ్‌ కేసుల్లో 51, 87 మంది మిస్సింగ్‌ కేసుల్లో 43 మంది చొప్పున ఆచూకీ తెలియాల్సివుంది.. అని డీజీపీ సైతం ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా మిస్సింగ్‌ కేసుల గురించి గణాంకాలతో అదనపు డీపీ (సిఐడి)ఉమెన్‌ సేఫ్టీ ఇంచార్జి స్వాతి లక్రా సైతం పత్రికా ప్రకటన విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. మిస్సింగ్‌లపై కథనాన్ని రాసిన ఈనాడు పత్రిక, డీజీపీ, అదనపు డీజీలపై పోలీసులు కేసు నమోదు చేయకుండా కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు.
సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ యువ సైన్యం సోషల్‌ మీడియాలో మిస్సింగ్‌ కేసుల గురించి పోస్ట్‌ చేసిన వారిపై అన్యాయంగా పోలీసులు » నాయించారని, గత శనివారం నాడు ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా 82 మంది మిస్సింగ్‌ అయ్యారని పోస్టింగ్‌ పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణ కాదని, పత్రికల్లో వచ్చిన కథానాన్ని ఆధారంగా చేసుకుని సామాజిక బాధ్యతతో సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టడాన్ని నేరంగా ఎలా పరిగణిస్తారని దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. యువ సైన్యం, వెంకట్‌ గురజాల ఇతరులకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారని, వారిపై బనాయించిన కేసుల్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  
 ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు  కేవలం ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధుల రక్షణ కోసం మాత్రమే పనిచేయకూడదన్నారు.. ప్రజల కోసం పోలీసు వ్యవస్థ పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా కేసులు పెట్టి భవిష్యత్తును దెబ్బతీయవద్దని, వెంకట్‌ గురజాల మరో ఇద్దరి  వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు పాల్పవద్దని కోరారు. డీజీపీ తక్షణమే తమ వాళ్ల భావప్రకటనా స్వేచ్ఛపై పెట్టిన తప్పుడు కేసుల్ని సమీక్షించి ఎఫ్ఐఆర్‌ను తక్షణమే రద్దు చేయాలని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కోరారు.


No comments:

Post a Comment