Saturday 5 January 2019

రాజకీయాలకు అతీతంగా జెండాలు, ఎజెండాలు పక్కన బెట్టి బిసి రిజర్వేషన్లకోసం పోరాడాలి ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.

  • రాజకీయాలకు అతీతంగా  జెండాలు, ఎజెండాలు పక్కన బెట్టి  బిసి రిజర్వేషన్లకోసం పోరాడాలి ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు.
  • 50 శాతం రిజర్వేషన్లు పెంచడానికి సుప్రీంకోర్టు అడ్డుకాదు..ప్రభుత్వము బిసీల వెనుకబాటు తనాన్ని అధ్యయనం  చేసి కోర్టుకు ఇస్తే.. కోర్టు బిసి రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకించదు.
  • బిసి రిజర్వేషన్ ల అమలు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణా జన సమితి చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించిన కుట్రపూరితంగా బిసిల రిజర్వేషన్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీయే కుట్రతో కేసులేసి అడ్డుకుంటుందని ఆరోపణ.
  • రాజకీయంగా ఎదగాలంటే పంచాయితీరాజ్ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ 
  • బిసి రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేసి కేసీఆర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆరోపణ.
  • ఎన్నికలు అడ్డుకునేందకు టీఆర్ఎస్ పార్టీ కేసులేస్తే తప్పులేదు కాని న్యాయం కోసం బిసిలు కోర్టుకు వెళితే తప్పెలా అవుతుందని సూటిప్రశ్న.
  • ఒక్క రోజులో సమగ్ర సర్వే చేయగలిగిన కేసీఆర్, ఆరునెలలుగా బిసిల కులగణన చేయకపోవడం కుట్ర పూరితమన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు.
  • బిసిల రిజర్వేషన్ల కోసం పార్టీల రహితంగా నాయకులు పోరాడాలని పిలుపు.





దళితులు సామాజిక అంటరాని తనం ఎదుర్కుంటుంటే... బీసిలు రాజకీయ అంటరాని తనం ఎదుర్కుంటున్నారని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎడతెగని పోరాటం చేసిన బీసి బిడ్డలు రాజ్యాంగ బద్దంగా బిసీలకు రావాల్సిన హక్కుల కోసం  మరో మారు  రోడ్డెక్కాల్సిన అవసరం ఏర్పడ్డదని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు. బిసి రిజర్వేషన్ ల అమలు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం మధ్యాహ్నం ఇందిరాపార్క్ వద్ద  తెలంగాణా జన సమితి చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించిన దాసోజు తెలంగాణా సాధన కోసం దాదాపు 1500 వందల మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే వారిలో ఎక్కువ మంది బీసిల బిడ్డలే అత్మహత్యలు చేసుకున్నారని  తెలంగాణా రాష్ట్ర సాకారం అయితే తమ హక్కులు సాధించుకోవచ్చని  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బరిగీసి కొట్లాడారన్నారు.  తెలంగాణా వస్తే సామాజిక న్యాయం వస్తుందని,  హక్కుల కాపాడ బడుతాయని, రాజ్యాంగ బద్దమైన ప్రజాస్వామిక హక్కులు పోందవచ్చని భావించారన్నారు. ఇందుకోసం చేస్తున్న పనులు పక్కన బెట్టి, రోడ్ల మీదికి వచ్చి కొట్లాడి తెలంగాణా సాధించుకున్నామన్నారు. కాని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ బీసిల నోట్లో మన్నుగోట్టి నాలుగున్నరేళ్ల తర్వాత కూడా ఎక్కడేసిన గొంగళక్కడే అన్నట్లు మార్చారని ఆరోపించారు.
గతంలో ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లు ఇప్పుడెందుకు ఇవ్వలేక పోతున్నారో స్పష్టం చేయాలి.
2010 లో కృష్ణమూర్తి వర్సెస్ భారత ప్రభుత్వం విషయంలో  సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తే ... ఆతర్వాత దేశవ్యప్తంగా జరిగిన ఎన్నికల్లో బీసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తుచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదశ్ లో కూడా రిజర్వేషన్లు అమలయ్యాయని కాని ఇప్పుడెందుకు రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలన్నారు. ఆర్డినెన్స్ ద్వారా అనుకున్న పదవులు ఇచ్చుకుంటున్న కేసీఆర్ 52 శాతం ఉన్న బిసి భవిష్యత్తును నిర్ణయించే రిజర్వేషన్లు విషయంలో ఆర్డినెన్స్  ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన ఎమ్మెల్యే,  ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతలుండగా ఎవరితో చర్చ చేయకుండా దొడ్డిదారిన  ఆర్డినెన్స్ ఎందుకు తేవడాన్ని డాక్టర్ శ్రవణ్ తప్పుపట్టారు.
బిసి ల పట్ల చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
బిసికులాలకు చెందిన వారిని బానిసల్లా బతకండని శాసించిండన్నారు. అణగదొక్కేందకు చేసే ప్రయత్నంలో భాగంగానే దొడ్డిదారిన ఎన్నికలకు పోతున్నాడన్నారు.  పంచాయితీరాజ్ చట్టం 2018 ప్రవేశ పెట్టినప్పుడు  సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 52 శాతం ఉన్నరని తెలిసిన  మేమెంతో మాకంత రావాలని ఉద్యమంలో కూడా కొట్లాడామన్నారు.  ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణాలో సమగ్ర సర్వే ప్రకారం  52 శాతం కాకుండా ఎందుకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని కోర్టులో కేసు వేసానని, విద్యా ఉపాధి రంగాల్లో ఏ,బీ,సి,డి, ఈ ,లుగా ఎలాగయితే రిజర్వేషన్లు అమలు అవుతున్నయో అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎందుకు అమలు చేయాలని కోరానన్నారు. కాని ముఖ్యమంత్రి తన స్ధాయి మరిచి వాడెవడో దాసోజు శ్రవణ్ అట ఏ,బీ,సి,డి,ఈ లు గా వర్గీకరించాలని కేసు వేశాడని వెటకారంగా మాట్లాడుతున్నాడని శ్రవణ్ ఆక్షేపించారు.
ఎన్నికలు అడ్డుకునేందకు టీఆర్ఎస్ పార్టీ కేసులేస్తే తప్పులేదు కాని న్యాయం కోసం బిసిలు కోర్టుకు వెళితే తప్పెలా అవుతుందని సూటిప్రశ్న.
13300 మంది కి రిజర్వేషన్లు చేయాలంటే ఎన్నికలు ఎప్పుడవుతాయని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి గతంలో 2009 లో జీహెచ్ ఎంసీ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఎన్నికలు అడ్డుకోవాలనే కుట్ర తో ఏ,బీ,సి,డి అమలు చేయాలని సత్యం రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ అడ్వకేట్, ఇవాళ అడ్వకేట్ జనరల్ గా ఉన్న రామచంద్రరావులతో కేసేయించింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకోసం కేసేస్తే తప్పులేదు కాని బిసిల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా కేసేస్తే తప్పని మాట్లాడతున్నారని ఆరోపించారు. మేమెంతో మాకంత ఇవ్వడానికి ముఖ్యమంత్రికి వచ్చిన కష్టమే0టో చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్లు వెలమలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నారని బిసిలకు చెందిన చిన్న కులాలు రాజకీయంగా అభివృద్ది చెందే అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

లీడర్ షిప్ ఎదగాలంటే పంచాయితీరాజ్ ఎన్నికల్ల రిజర్వేషన్లులుంటేనే సాధ్యమన్న శ్రవణ్
గ్రామస్ధాయిల్లో జరిగే ఎన్నికలు లీడర్ షిప్ ఎదిగేందుకు అవకాశం ఉంటుందని కొత్తనాయకత్వం తయారు కావాలంటే రిజర్వేషన్లు అవసరమన్నారు. సర్పంచ్ లు, ఎంపీటిసి, జెడ్పీటిసి అయితేనే రాజకీయంగా ఎదిగి తద్వారా  జెడ్పీఛైర్మెన్ లుగా ఆతర్వాత ఎమ్మెలేలు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దురదృష్టవశాత్తూ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో అతి తక్కువ శాతం ఉన్న రెడ్లు  39 శాతం మంది గెలిచినా.. 52 శాతం మంది ఉన్న బీసిలు 25 మంది కూడా గెలవలేదన్నారు. ఇందుకు కిందిస్ధాయిలో సర్పంచ్ లు ఎంపీటిసిలు, జెడ్పీటిసిలు జనాభాకు అనుగుణంగా లేకపోవడం వల్లనే అన్నారు. రిజర్వేషన్లు సరిగ్గా అమలయితే అసెంబ్లీలో  60 మంది ఎమ్మెల్యేలు బీసిలకు చెందిన వారే ఉండేవారన్నారు. ఎక్కువ సంఖ్యలో బిసీలు ప్రజాప్రతినిధులుగా ఉంటే అడుక్కునే స్ధాయి నుంచి శాసించే స్ధాయికి వస్తామన్నారు. బిసి ల హక్కుల కోసం చట్టసభలో కూచ్చొని గల్లా పట్టి అడిగి  సాధించుకునేవారమని తెలిపారు.
కాని కుమ్మరి కుండలు చేయాలని, చాకలి బట్టలుతుకాలని, మంగలి కటింగులు చేసుకోవాలని దూదేకుల వాళ్లు దూదేరుకోవాలని కేసీఆర్ అంటున్నారన్నారు. ముస్లీంలకు ప్రతినిధిలా మాట్లాడుతున్న అసదొద్దీన్ సోయిలేకుండా కేసీఆర్ కు గుడ్డిగా మద్దతు పలుకుతున్నారని ముస్లీంలకు రిజర్వేషన్లు అమలయితే వందల సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఉండేవారని బీసీ కులాలన్ని సంఘటితంగా పోరాడాలని పిలుపు నిచ్చారు.
హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ తనకు అనుకూలంగా కోర్టులో కేసులేయించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్న శ్రవణ్
బీసి కులాలకు  న్యాయం జరుగాలని హైకోర్టులో కేసేస్తే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు  బిసి కులగణన చేయాలని
చాలా స్పష్టంగా ఆదేశాలిచ్చారని బీసిల వెనుక బాటు తనం పై అధ్యయనం చేయాలని తీర్పు చెప్పారన్నారు. అవి రెండు చేసిన తర్వాత గ్రామాల వారిగా ఆ వివరాలన్ని కూడా గ్రామ సభలో పెట్టి ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించాలని తద్వారా   ఎన్నికలకు పోవాలా అని ఎ,బీ,సి,డి,ఈ చేయాలని తీర్పు ఇస్తే తనకు తోచిన విథంగా వ్యవహరించారన్నారు.  జూన్,2018లో  కోర్టు తీర్పు వస్తే గడిచిన ఆరునెలలుగా కులగణన చేపట్టకుండా, కాలాయాపన చేశారన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేయగలిగారని కాని కేవలం 2 కోట్ల మంది బీసిల లెక్కలు తీయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు  ఇస్తే పక్కన బెట్టి... టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అనుచరుడు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి వేసిన కేసుల ఆధారంగా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని కేసేయించారన్నారు. కేసులో మూడు, నాలుగు మార్లు హియిరింగు వచ్చినా  రాష్ట్రప్రభుత్వం నుంచి ఏఒక్కరూ హాజరుకాకుండా  బిసిల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకనే కోర్టు50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కు పోకుండా సుప్రీంకోర్టుకు పోయి కృష్ణమూర్తి జడ్జిమెంట్ ను అసరాగా చేసుకుని తీర్పునిచ్చిందన్నారు. బీసీల వెనకబాటు తనంను పై స్పష్టమైన సమాచారం వస్తే తదనుగుణంగా  రిజర్వేషన్లు కేటాయించుకోవచ్చన్న  విషయాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.  ఇదే విషయాన్ని నిమ్మక జయరాజ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
పార్టీ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి బీసి రిజర్వేషన్లుకోసం సమైక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసిల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని లేదంటే బానిసకొక బానిస అన్నట్లు పరిస్థితి  మారుతుందన్నారు.
తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వినయ్ కుమార్,బీసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, టీజెఎస్ నేతలు పీఎల్ విశ్వేశ్వర్, దిలీప్ కుమార్, గాదె ఇన్నయ్య, , జస్వంత్, ఝాన్పీ గారు, వార్డు సత్యం, బూస శ్రీనివాస్ గారు నర్సయ్యగారు రమేశ్  తదితరులు పాల్గొన్నారు.

Video Link :

No comments:

Post a Comment