Sunday 30 December 2018

ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వండి, బీసి కులాల గణన ఎలా సాధ్యం కాదో చేసి చూపిస్తాను..డాక్టర్ శ్రవణ్ దాసోజు

పంచాయితీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించకుండా బీసిల నోట్లో మన్ను కొట్టొద్దన్న డాక్టర్ శ్రవణ్ ..
ప్రభుత్వమే కుట్రతో సుప్రీంకోర్టు కు వెళ్లి బీసి రిజర్వేషన్లు తగ్గించిందని ఆరోపణ.
జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేపట్టాలని కోరితే ఎన్నికలు అడ్డుకుంటున్నామని ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్న శ్రవణ్.
బీసీ లకు అన్యాయం చేస్తూ ఎన్నికలు నిర్వహించడం ఎవరి ప్రయోజనాలకోసమని సూటి ప్రశ్న.
బీసిలకు గొర్లు, బర్లు, మంగలికత్తులు,రాజకీయ పదవులు కాదు...రాజ్యాధికారం కావాలని డిమాండ్.
తనకు ఒక్కరోజు అధికారం ఇస్తే రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో చేసి చూపిస్తానన్న శ్రవణ్
అధికార పార్టీ బిసి నాయకులంతా ఇప్పటికైనా బీసిలకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు.
ఆంధ్రా పత్రికలంటూ మీడియా పై ముఖ్యమంత్రి అక్కసు సరికాదని విమర్శ.






పంచాయితీరాజ్ ఎన్నికల్లో కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బిసి రిజర్వేషన్లు కల్పించాలని కోరితే   ఎన్నికలు అడ్డుకుంటున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడడం సరికాదని టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను బేవఖూఫ్ లు, ఈడియట్లు అని తిట్టడం ఆయన విజ్నతకే వదిలేస్తున్నామన్నారు. తండ్రి లాంటి కేసీఆర్ తనను వాడూ... వీడంటూ మాట్లాడినా ఫర్వాలేదని...అదే సందర్బంలో బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం సహించబోనన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సామెతను పక్కన బెట్టి  రెండో మారు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నాలుక మడత పెట్టి అహంకారంతో మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  కేసీఆర్ కేవలం టీఆర్ఎస్ పార్టీకే ముఖ్యమంత్రిలా భావిస్తున్నారని ఆయన యావత్ తెలంగాణాకు ముఖ్యమంత్రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి  మాట తీరు యావత్ తెలంగాణా సమాజం సిగ్గుపడేలా, తల దించుకునేలా ఉందన్నారు.
జనాభా దామాషా ప్రకారం బీసిల వర్గీకరణ చేపట్టాలని కోరితే పంచాయితీ ఎన్నికలు అడ్డుకుంటున్నామని ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు సరికాదన్న శ్రవణ్.
జనాబా దామాషా ప్రకారం బీసీ వర్గీకరణ చేపట్టి తద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరితే కాంగ్రెస్ పార్టీ కేసు వేసి ఎన్నికలు ఆపుచేసిందని ముఖ్యమంత్రి గారు అనడం ఒక పచ్చి అబద్దమని, అభూత కల్పనేనని డాక్టర్ శ్రవణ్  అన్నారు. ముఖ్యమంత్రికి సమాచారం లోపం ఉన్నట్లుందని , అధికారులు  తగిన సమాచారం ఇవ్వడం లేదోమోనని ఎద్దేవా చేశారు. లేదంటే ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్షాలపైన బురదజల్లేకార్యక్రమానికి పూనుకున్నారేమోనని బట్టకాల్చి మీదేసేందుకు ప్రయత్నిస్తున్నారేమోనని ఆరోపించారు.  
తప్పుల తడకగా తయారుచేసిన పంచాయితీ రాజ్ ఆక్ట్ ను ప్రశ్నిస్తూ లేఖరాస్తే సమాధానం రాలేదన్న శ్రవణ్
పంచాయితీ రాజ్ ఆక్ట్ లో రెండు రకాల కేసులున్నాయని కాని వాటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి దబాయింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. జూన్, 2018 మొదటి వారంలో పంచాయితీరాజ్ ఆక్ట్ ను తెచ్చారన్నారు.  ఆయన ఆదరాబాదరాగా తెచ్చిన ఆక్ట్ లో తప్పులున్నాయన్నారు. ఒక హేతు బద్దత లేకుండా బిసి రిజర్వేషన్లును ఖరారు చేశారని  2014 లో చేసిన సమగ్ర సర్వే ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఎలా ఖరారు చేస్తారో చెప్పాలన్నారు.  ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ జూన్ 9, 2018లో ముఖ్యమంత్రికి లేఖ రాసినా సమాధానం రాలేదని అందుకు సంబంధించిన లేఖ ప్రతిని మీడియాకు శ్రవణ్ ప్రదర్శించారు. అలాగే  ఆర్టీ ఐ ప్రకారం 14.6.2018 నాడు మరో లేఖ ను 33 శాతం రిజర్వేషన్లు ఎలా ఖరారు చేశారని కమీషనర్ పంచాయితిరాజ్ , ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయితీరాజ్, ఎన్నికల కమీషనర్ లకు రాసామని కాని ఎవరూ స్పందించలేదన్నారు.
ప్రభుత్వ స్పందన లేక పోవడం వల్లే కోర్టు తలుపు తట్టామన్న శ్రవణ్ దాసోజు
ఎన్నిమార్లు ప్రభుత్వానికి లేఖ రాసిన  ప్రయోజనం లేక పోవడం వల్లే తేది 17.06.2018 నాడు రిట్ పిటిషన్ నెంబర్ 20477 ద్వారా  తాను, యాదాద్రి బోనగిరి జిల్లాలకు చెందిన  రవీంద్రానధ్ లు హైకోర్టులో పిటిషన్ వేసామన్నారు.
తాము వేసిన కేసులో ఎక్కడా ఎన్నికలు ఆపాలని కోరలేదని కేవలం కులగణన చేపట్టి తద్వారా జనాభా దామాషా ప్రకారం బిసిలకు ఎబీసిడి ఈ వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్లు కేటాయించాలని కోరామని స్సష్టం చేశారు. కోర్టుకు చేసిన వినతిలో 52 శాతం ఉన్న బిసిలకు 33 శాతం ఏ ప్రాతిపదిక న అమలచేస్తారని అదే విధంగా విద్యా ఉపాధి రంగాల్లో అమలవుతున్నట్లు ఎబీసిడిఈ వర్గీకరణ చేయాలని మాత్రమే కోరామని డాక్టర్ శ్రవణ్ స్పష్టం చేశారు.
నిమ్మక జయరాం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీర్పును పాటించాలన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఉల్లంఘించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.
తాము వేసిన పిటిషన్ ఆధారంగా విచారించిన  హైకోర్ట్ ధర్మాసనం బిసి రిజర్వేషన్ల అంశంలో  జస్టిస్  ఎంఎస్ రామచంద్రారావుగారు  నిమ్మక జయరాం వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంద్ఱప్రదేశ్ సందర్భంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు.తేది 27.6.2018 నాడు ఇచ్చిన తీర్పు ప్రకారం  గతంలో ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ  కులగణన చేయాలని  అలాంటి సర్వేను ప్రజలముందుంచాలని తద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆతర్వాతే  రిజర్వేషన్లను ఖరారు చేసి రాజ్యంగం ప్రకారం  అమలు చేయాలని ఆదేశించారన్నారు. కాని  ఆరునెలల క్రితం తీర్పు వస్తే ఇన్నాళ్లు ఆ తీర్పును అమలు చేయకుండా, బిసిల కుల గణన చేయకుండా  హైకోర్టు తీర్పు ఉల్లంఘించారని ఆరోపించారు.
బీసిలకు గొర్లు, బర్లు, మంగలికత్తులు,రాజకీయ పదవులు కాదు...రాజ్యాధికారం కావాలని డిమాండ్.
బిసిలకు కావాల్సింది గొర్లు బర్లు  కాదన్నారు డాక్టర్ శ్రవణ్.. రాజకీయపదవుల ఎరవేసి రాజ్యాధికారాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీసిలంతా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారన్నారు. రాజ్యాధికారం కల్పించాలని కోరితే దొంగ మాటలతో కాలక్షేపం చేస్తూ, నెపం కాంగ్రెస్ పార్టీ పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో బీసిలను ఏ,బి  వర్గాలుగా విడగొట్టి రిజర్వేషన్లు అమలుచేస్తున్నారని అదేవిధానాన్ని ఇక్కడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లి పంచాయితీ ఎన్నికలు ఆపాలని చూస్తోంది టీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపణ
పంచాయితీరాజ్ ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపణ చేస్తున్న కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని నిజానికి రిట్ పిటీషన్ నెంబర్  21651, 2018 ద్వారా  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుడు, నాగర్ కర్నూల్ ఎంపీటిసి  గోపాల్ రెడ్డి   తమిళ నాడు రాష్ట్రం మాదిరిగా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేసు వేశారని దాన్ని విచారించిన న్యాయస్ధానం 50 శాతం దాటి రిజర్వేషన్లు ఇవ్వడం వీలు కాదని తీర్పు ఇచ్చిందని గుర్తిచేశారు. ముఖ్యమంత్రి కి సమాచారం లోపం ఉంటే దానికి సంబంధించిన కాపీని పంపిస్తామని డాక్టర్ శ్రవణ్ అన్నారు. గోపాల్ రెడ్డి వేసిన కేసులో మూడు మార్లు హియరింగ్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వాదించడానికి ప్రభుత్వ న్యాయవాది వెళ్లలేదన్నారు. తదనుగుణంగానే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.  ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసే తీరిక లేకుండా ఉండడం వల్లే బీసిలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. వాస్తవాలు వెల్లడి చేయకుండా తమిళ నాడు తరహాలో 69 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడం వల్లే 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వాలన్న కృష్ణమూర్తి కేసు అంశాలు సాధ్యం కాదని తేల్చిందని శ్రవణ్ వివరించారు. హైకోర్టులో వాస్తవాలు వెల్లడిచేసిఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. హైకోర్టులో కొట్లాడే అవకాశం ఉన్నా సుప్రీం కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. ఇవన్నీ మరుగున పెట్టి కాంగ్రెస్  వల్లే నష్టం జరుగుతున్నట్టు కేసీఆర్ వక్రీకరించడం సరికాదన్నారు. అసలు కోర్టులో కేసు వేసిన గోపాల్ రెడ్డి ఎవరి ప్రోత్భలంతో వేసారో కూపీ లాగాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ పక్కన పెట్టేందుకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారని న్యాయపరంగా ఇది నిలవదని శ్రవణ్ అన్నారు. 112 కులాలతో ఉన్న బిసి ల్లో ఉప కులాల వారిగా రిజర్వేషన్ల ఖరారు చేసి ఎన్నికలు జరుపాలని కోరితే ఎన్నికలు ఆపేందుకు కుట్ర పన్నింది కేసీఆరేనని ఆరోపించారు. కులాల వారిగా గణన చేపడితే అట్టడుగున ఉన్న చాకలి, మంగలి, కంసాలి, వడ్రంగి, ముస్లీం లకు రాజకీయాధికారం వస్తుందన్నారు. 2009 లో జీహెచ్ ఎంసీలో మున్సిపాలిటీలో ఎ,బి,సి,డి వర్గీకరణ చేయాలని సత్యం రెడ్డి కేసు వేసిన విషయాన్ని డాక్టర్ శ్రవణ్ గుర్తుచేశారు. అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో అందరు ఏ ఉద్దేశ్యంతో కొట్లాడారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బిసిలకు లాభం కలిగేందుకు 2018లో కేసేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బిసిల కు రాజ్యాధికారం వస్తే గతంలో 25 వేల కోట్లిస్తానని మోసగించిన విధానాన్ని ఎండగట్టే వారమని సబ్ ప్లాన్ వేస్తానని మోసగించిన విషయాన్ని ప్రశ్నించేవారమన్నారు.
రాజ్యాధికారంలో బిసి కులాలకు తగిన ప్రాధాన్యం లేదన్న శ్రవణ్
119 స్ధానాలున్న శాసనసభలో కేవలం 25 మంది మాత్రమే ప్రతినిధులున్నారని మొత్తం జనాభాలో 52 శాతం మంది ఉన్న తమ కు ఎందుకు తక్కువ స్ధాయిలో ప్రతినిధులుండాలన్నారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేస్తే  అన్నికులాలకు అవకాశాలు వచ్చేవన్నారు. లోకల్ బాడీల ఎన్నికల్లో అన్ని కులాలకు సమానావకాశాలు వస్తే రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుందని అది కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాలదేనని హితవు పలికారు. చట్టాన్ని అమలు చేయమంటే  అడ్డుకుంటున్నారనడం భావ్యం కాదన్నారు.
రిజర్వేషన్లు తేల్చడం కష్టమేమీ కాదని తనకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తానని సవాల్
2014లో సమగ్ర సర్వేలో 4 కోట్ల మంది వివరాలు సేకరించగలిగిన సత్తా, లక్షకోట్లతో కాళేశ్వరం కట్టగలిగిన సత్తా ఉన్న  ఉన్న ముఖ్యమంత్రి కి బిసిల కులగణన ఎందుకు సాద్యం కాదని ప్రశ్నించారు. బీసీల పట్ల ముఖ్యమంత్రి కి చిత్తశుద్దిలేదన్నారు. అంబేధ్కర్ రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.బిసీ ల పట్ల ప్రేమ ఉన్నట్లు ముఖ్యమంత్రి నటిస్తున్నారని ఎంబీసి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఆయన కార్యాలయంలో కనీసం కుర్చీలు బెంచీలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అలాగే ఒక్క రూపాయి కేటాయించకుండా  అలంకార ప్రాయంగా కార్పోరేషన్ ఏర్పాటు తో లాభమేంటని ప్రశ్నించారు. బీసిలను మోసగిస్తున్న కేసీఆర్ తనకేమీ తెలియనట్లు నటిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి బీసీ కులాలను మోసగిస్తున్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసి నాయకులు స్వలాభం కోసం యావత్ బీసి సమాజానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీసి కులాల గణన ఎలా చేయాలో చేసి చూపిస్తానని శ్రవణ్ సవాల్ విసిరారు.
ఆంధ్రా పత్రికలంటూ మీడియా పై ముఖ్యమంత్రి అక్కసు సరికాదని విమర్శ.
ఆంధ్రా వార్తలు రావోద్దంటున్న ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల భాషల్లో అడ్వర్టయిజ్ మెంట్ లు ఎందుకు ఇచ్చినారో చెప్పాలన్నారు. వేల కోట్లు రూపాయల అడ్వర్టయిజ్ మెంటుల పేరిట ఎందుకు ఖర్చుచేశారో అవన్నీ తిరిగి కట్టాలని చెప్పారు. ఒరిస్సాలో పశ్చిమ బెంగాల్ల ఉత్తర్ ప్రదేశ్లో మీరు కలిసిన నాయకుల కు సంబంధించిన వార్తలు ఎందుకు రావాలన్నారు. ఆంధ్రా వారు వద్దుకాని ఆ పెట్టుబడి దారులు మాత్రమం కావాలా అని ప్రశ్నించారు. మీకు మద్దెల కొడితే మంచోళ్లు లేకుండే వారు అంతుచూస్తామనడం మంచిది కాదన్నారు. స్వచ్చమైన భయంలేని మీడియా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. డాక్టర్ శ్రవణ్ దాసోజు వెంటపిసిసి కార్యదర్శి  కేతూరు వెంకటేశ్  మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Press Meet Video Link : 

No comments:

Post a Comment