Saturday 12 May 2018

Indian National Congress - Telangana General Secy, Dr Sravan Dasoju Addressed a Press Conference from Gandhi Bhavan on #Telangana Employees Issues. Demanded the Telangana CMO to immediately enact & resolve their issues who have contributed their services to the formation of #Telangana.

 శ్రీయుత ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు గారికి
ఆర్యా….
విషయం: ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల న్యాయమైన హక్కుల సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం . ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను విజ్ఞప్తి…
ఉద్యోగులంతా తెలంగాణా రాష్ట్రం సాకారం చేసేందుకు 42 రోజుల పాటు తమ జీవితాలను, జీతాలను ఫణంగా పెట్టి పోరాటం చేసిన్రు. అన్ని సంఘాలను కలుపుకుని సకలజనుల సమ్మెచేపట్టి ఉద్యమం ఉధృతం గా ముందుకు సాగేందుకు దోహదం చేసిన్రు. నాడు ఉద్యోగులు, సకలజనులు చూపిన పోరాట పటిమను, తెగువను గౌరవించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశిన్రు. తమ జీవితాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యోగులు, మీ ప్రభుత్వ పాలనలో కనీస హక్కుల సాధన కోసం రోడ్లెక్కాల్సిన దుస్థితిని కల్పించారు. తెలంగాణా వస్తే తమ హక్కులు సాధించుకోవచ్చని, తమ కలలు నెరవేరుతాయని భావించిన ఉద్యోగుల ఆశలు అడియాసలుచేశిన్రు. మరోపక్క ఉద్యోగ సంఘనేతలు హక్కుల సాధనలో విఫలం చెందిండ్రు. ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతుండ్రు.. ఉద్యమ సమయంలో గంటల తరబడి సమయమిచ్చి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మీరు, వారి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కనీసం 5నిమిషాల సమయం ఇవ్వలేక పోవడం దురదృష్టకరంగా భావిస్తున్నం. అయినా గడిచిన నాలుగు సంవత్సరాలుగా తమ కనీస హక్కుల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. కొన్నాళ్లుగా వారి పోరాటాన్నిమేము నిశితంగా గమనిస్తున్నం, భాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వారి న్యాయమైన కోరికలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల కనీస హక్కులను కలిపించాలని, ఈ కింది న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఉద్యోగుల డిమాండ్లు..
1.ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలి
సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండాలని చెప్పిన తీర్పు ను అనుసరించి దేశంలోని కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోబోతున్నాయి. అదే విధంగా తెలంగాణలో కూడా సిపిఎస్ విధానాన్ని పున: సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నం. ఈ విధానంలో ఉద్యోగి వేతనంలో 10 శాతం, ప్రభుత్వవాటా 10 శాతం జమ సక్రమంగా జరుగుతుందో లేదో తెలిపే యంత్రాంగం సరిగా లేకపోవడం, రిటైర్మెంట్ నాటికి నష్టపోతామన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నరు. కాబట్టి ఈ విధానంలో ఉన్న 1,12,765 మంది ఉద్యోగుల ఆందోళనను తొలగించి వారికి సామాజిక భద్రత కల్పించే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలి. పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దరిందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగుల ఆకాంక్షల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నం.
2. పీఆర్సీ వెంటనే ఏర్పాటు చేయాలి
కొత్త పీఆర్సీని జూలై 1. 2018 నుంచి అమలుచేయాల్సి ఉంది. కాని పీఆర్సీని ప్రకటించడం పట్ల మీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నరు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 9 వ పీఆర్సీ 39 శాతం ఫిట్మెంట్ ఇస్తూ ఇతర ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం. అదేవిధంగా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గడువు కన్నా5 నెలల ముందే 10th పీఆర్సీని ప్రకటించి, రిపోర్ట్ ఆలస్యం అయినప్పుడు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చి ఉద్యోగులను ఆదుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నాం. కాని తెలంగాణా కోసం తెగించి కొట్లాడిన ఉద్యోగులు పీఆర్సీకమీషన్ నియమించాలని పోరాడుతున్నామీరు పట్టించుకోవడం లేదు.
3. బదిలీలు వెంటనే చేపట్టాలి
తెలంగాణా ఉద్యమ సమయంలో ఏర్పడ్డ గందరగోళం వల్ల పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బదిలీలను రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా గత నాలుగు సంవత్సరాలుగా చేపట్టకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా బదిలీలు లేక పోవడంతో కుటుంబాలకు దూరంగా కాలం వెళ్లదీస్తూ తీవ్ర మానసిక వేదన కు గురవుతున్నరు. కాబట్టి ఉద్యోగుల బదిలీలను వెంటనే చేపట్టాలని, వారి కుటుంబాలతో జీవితం గడిపేలా చేయాలని కోరుతున్నాం.
4. తెలంగాణా ఉద్యోగులను వెనక్కి రప్పించాలి
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా, తెలంగాణా ఉద్యోగుల విభజన కోసం కేంద్రం వేసిన కమలనాధన్ కమిటి ఇక్కడి వారిని ఆంధ్రాకు కేటాయించడం వల్ల, ఇంకా దాదాపు 750 మంది తెలంగాణా ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని స్వరాష్ట్రానికి రప్పిస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినా ఖాళీలు లేవన్న పేరిట వారిని అక్కడే కొనసాగిస్తున్నారు. అనేక సమస్యలవల్ల 26 మంది నాలుగోతరగతి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నరు. కాబట్టి ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే వారికి ఉద్యోగాలను కల్పించి వారిని స్వరాష్ట్రం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం.
5. ఆర్డర్ టూ సర్వ్ నిబంధన ను తొలగించాలి
తెలంగాణా ప్రభుత్వం ఆదరాబాదరాగా 10 జిల్లాలను 31 కొత్త జిల్లాలగా ప్రకటించి ఉద్యోగుల కేటాయింపును మాత్రం మరిచిపోయింది. కొత్త ఉద్యోగులను నియమించకుండా, ఉన్నవారితోనే పనిచేయిస్తూ కాలాయాపన చేస్తోంది. ఆడంబరంగా జిల్లాల ఏర్పాటుచేశామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలనా సౌలభ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగా పెరగడానికి మాత్రమే బాగా ఉపయోగపడింది. చాలా జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగనియామకాలు లేక ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడంవల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నరు. అటు అధికభారంతో ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నరు. కాబట్టి ఆయా జిల్లాలలో తగిన సిబ్బందిని వెంటనే భర్తీచేయాలి. కొత్తజిల్లాలు ఏర్పాటయ్యాక కేవలం ఆరునెలల్లో వారి స్వంత జిల్లాలకు పంపుతామని చెప్పి ఇప్పడికి పంపకుండా.. సంవత్సరంన్నరనుంచి తాత్సారం చేయడం వల్ల వారు మానసిక వేదన కు గురవుతున్నరు. కాబట్టి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను వారి స్వంత (స్ధానిక) జిల్లాలకు పంపాలని డిమాండ్ చేస్తున్నాం.
6. పదవి విరమణ వయస్సును పెంచాలి
ఉద్యోగావకాశాలకు వయోపరిమితిని పెంచుతూనే .. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాలి.. ఇప్పటికే నాలుగోతరగతి ఉద్యోగులు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ఐఎఎస్, ఐపీఎస్ ఉద్యోగుల వయస్సు 60 వరకు పెంచారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు పెంచాలని కోరుతున్నాం.
7. పదోన్నతులు వేసవిలోనే నిర్వహించాలి
ఉద్యోగులు కోరుతున్నట్టు పదోన్నతులు రెండు సంవత్సరాల సీనియారిటి ఉంటే ఇవ్వాలి. అదే విధంగా వేసవిలో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తే వారికి సౌకర్యంగా ఉంటుంది. .. (పిల్లల విద్య కోసం తగిన సంస్ధలను ఎన్నుకునేందుకు కొత్త చోటకు బదీలిపై వెళ్లినప్పడు ఆటంకం లేకుండా ఉంటుంది) కాబట్టి బదిలీలను వేసవిలో చేపట్టి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం.
8. కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
తెలంగాణా రాష్ట్రం వస్తే లక్షల ఉద్యోగాలొస్తయని నిరుద్యోగులను మభ్యపెట్టిన మీరు రాష్ట్రం ఏర్పాటయి నాలుగేళ్లు గడిచినా ఆదిశగా చర్యలేవీ తీసుకోవడం లేదు. పైగా ఆదరాబాదరాగా జిల్లాల సంఖ్య పెంచి ఆర్డర్ టూ సర్వ్ పేరిట ఉద్యోగులను ఇతర జిల్లాల్లో పనిచేయించడం, తగిన సిబ్బందిలేక ఉన్నవారి పై పనిభారం పెరుగుతోంది. ఇప్పటికే 21 జిల్లాలకు రెగ్యులర్ డీఈవోలు లేరు, 63 డిప్యూటీ ఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 45 మండలాలకు ఎంఈవోలు లేరు. 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు, 4380 కొత్త పంచాయితీలు ఏర్పాటుచేసినా ఏ ఒక్క చోటా ఉద్యోగుల నియామకం చేపట్టలేదు. మరో పక్క నిరుద్యోగులు వయస్సు మీరడంతో ఉద్యోగాలు రాక అవస్ధలు పడుతున్నరు. కాంగ్రెస్ హయాంలో వరుస డీఎస్సీలను నిర్వహించి వేలాదిగా ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటవెంటనే భర్తీచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ..తక్షణమే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
9. పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలి
70 సంవత్సరాలు దాటిన పెన్షనర్ కు 15 శాతం అదనపు పెన్షన్ ను ఇవ్వాలని, అదే విధంగా 90 సంవత్సరాలు దాటిన వారికి 100 శాతం పెన్షన్ పెంచాలని ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ ను అమలు చేయాలి. అలాగే అదనపు గ్రాట్యుటీని ఇచ్చి వయోభారం వల్ల ఆందోళన చెందుతున్న వారిని ఆదుకోవాలని కోరుతున్నాం. దాదాపు 1,54,680 మంది పెన్షనర్లు మరియు 1,00,656 మంది ఫ్యామిలీ పెన్షనర్ల సంక్షేమంకోసం తెలంగాణా ప్రత్యేక ఇంక్రిమెంట్ వీరికి కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నం.
10. ఏకీకృత సర్వీ స్ నిబంధన అమలు చేయాలి
ఉపాధ్యాయ ఉద్యోగుల ఏకీకృత సర్వీస్ రూల్స్ లో న్యాయపరమైన ఆటంకాలు తొలగించి …అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలి. ఉపాధ్యాయుల అర్హతలను బట్టి ఇచ్చే జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ లకు అడ్డంకిగా ఉన్న జీవో నెంబర్ 223ని రద్దు చేసి జీవో 302 ప్రకారం 40 శాతం జూనియర్ లెక్చరర్ లుగా ప్రమోషన్లు ఇవ్వాలి.

11. 398 స్పెషల్ టీచర్ల సమస్య పరిష్కరించాలి
టీడిపి ప్రభుత్వ (ఎన్టీయార్) హయాంలో 398 రూపాయల వేతనంతో నియమింపబడిన (స్పెషల్ టీచర్లుగా) ఉపాధ్యాయులకు సర్వీస్ కాలానికి నోషనల్ ఇంక్రీమెంట్ లు ఇవ్వాలి.. డబ్బులు సరిపోక చాలా మంది ఉపాద్యాయులు మానసిక వేదనకు గురవుతున్న విషయాన్ని మానవతాదక్ఫథంతో పరిష్కరించాలని కోరుతున్నాం.
12. జిల్లాల్లో ఉద్యోగులందరినీ వెల్ నెస్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలి.
అన్ని జిల్లా కేంద్రాలలో ఉద్యోగులందరినీ వెల్నెస్కేంద్రాలను ఏర్పాటు చేయాలి. హెల్త్ కార్డుల ద్వారా రాష్ట్రములోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యము అందించుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నం.
13. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి, నియమ నిబంధనలకనుగుణంగా ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
తెలంగాణా రాష్ట్రం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులుండరన్న మీ మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నం. నాలుగు సంవత్సరాలు గడిచినా మీరు ఆదిశగా చర్యలు చేపట్టక పోవడం దురదృష్టకరంగా భావిస్తున్నం.. చంద్రబాబు హయాంలో ఏర్పాటయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ దోపిడి విధానానికి స్వస్తి పలికి తక్షణమే వారందరిని పర్మినెంటు చేయాలని, ఔట్ సోర్సింగ్ విధానానికి స్వస్తి పలికి రెగ్యులర్ ప్రాతిపదికను ఉద్యోగులను నియమించాలని, వారి కనీస హక్కులను కాపాడాలని, ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నం..
14. తెలంగాణ ప్రభుత్వం పదవి విరమణ పొందిన వారిని అకారణంగా తిరిగి కీలక పదవుల్లో నియమిస్తూ, సర్వీస్ లో ఉన్న వారికీ తీవ్ర నష్టం చేస్తుండ్రు. ఈ తప్పుడు విధానం కు స్వస్తి చెప్పాలి
15. ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారం కోసం అడ్మినిష్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను పునురుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాం.
16. ఆర్భాటంగా ప్రకటించిన తెలంగాణా ఇంక్రిమెంటు ను ఉద్యోగుల రిటైర్మెంటు తర్వాత కూడా వారికి వర్తింపజేయాలి ప్రస్తుత పెన్షనర్ల కు కూడా వర్తింప చేయాలి
17. పండిత్ మరియు పిఇటీ పోస్టులన్నిటినీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయలి.
18. క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలి
19. పదవ తరగతి పరీక్షా పేపర్ల వ్యాల్యూయేషన్ లో ప్రస్తుతం ఇస్తున్న రెమ్యునరేషన్ రెట్టింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. వారి శ్రేయస్సుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2005-06 లో గోపన్ పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో వందల ఎకరాల భూములను కేటాయించింది. టీఎన్జీవో, ఏపీ ఎన్జీవో సంఘాలతోపాటు, సెక్రటేరియట్ ఉద్యోగులు, హైకోర్ట్ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలను కేటాయించింది. కాని మీ ప్రభుత్వం అక్కడ కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యింది.
ఏ ప్రభుత్వాలైనా ఉద్యోగుల శ్రమ ఫలితంతోనే మనుగడ, అభివృద్ది సాధిస్తుంది. ద్యోగుల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పాటుపడితే..వారి సహకారంతో మెరుగైన సమాజాన్ని నిర్మించడం సాధ్యపడుతుందన్న కనీస స్పృహతో ఉపాధ్యాయ, ఉద్యోగుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వం వారి హక్కులను కాపాడాలని, తద్వారా ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రజాస్వామిక తెలంగాణా సాకారం చేసే దిశగా అడుగువేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ వారికీ అండగా ఉంటుంది.
ఇట్లు
N Uttam Kumar Reddy Dr Sravan Dasoju
President General Secretary
Copy to
1. The Honorable Minister for Finance, Chairman, Cabinet Sub-Committee on Employee Issues, Govt of Telangana
2. The Chief Secretary, Govt of Telangana, Secretariat
3. Shri Karam Ravinder Reddy, President, TNGOs Association & Chairman, Telangana Employees JAC, TNGOs Bhavan, Nampally, Hyderabad
4. Ms V Mamatha, President, TGOs Association, Gagan Vihar, Hyderabad


No comments:

Post a Comment