Thursday 13 April 2017

ఉక్కు పాదంగా మారిన ఉద్యమ నాయకుడు


ఎస్టీ, మైనార్టీల 12శాతం రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంధ్రశేకర్ రావు శాసన మండలిలో మాట్లాడుతూ అవసరమైతే తాను జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పారు. రిజర్వేషన్లపై రాష్ట్రాలకు హక్కులు ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. హక్కుల కోసం ధర్నాలు చేసే అధికారం కేవలం పాలకులకే ఉంటాయా....పాలకులు చేసే అన్యాయాలపై గొంతెత్తి ఉద్యమించే హక్కు మరెవరికి ఉండకూడదా.... ధర్నాలు చేయకూడదా.... ఇందిరాపార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ ను సర్కార్ ఎత్తివేసిన సమయంలోనే ..ముఖ్యమంత్రి శాసనమండలిలో తాను జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పడం యాధృఛికం కావొచ్చు.కానీ ఆప్రకటన వంద ప్రశ్నలు...వేయి ఆలోచనలను రగిలిస్తుంది.

ఒకవైపు ఆందోళనలు చేయడమంటే అభివృద్దిని అడ్డుకోవడమేనంటూ గొంతు చించుకుంటున్న సర్కార్ ...మరోవైపు ఆందోళనలకు పిలుపునివ్వడం ద్వందప్రమాణాలకు, రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.

అధికారంలోకి వచ్చీ రాగానే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం బంద్ కు పిలుపునిచ్చింది. అదే మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు మాట్లాడితే ....కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టే అధికారం మనకు లేదని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు.అంటే తాను ఏది చేసినా కరెక్ట్ ఇతరులు ఏదీ చేసినా తప్పు అన్న చందంగా కేసీఆర్ వైఖరి ఉంది.

సింగరేణి కారుణ్య నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం ....సింగరేణి బంద్ కు పిలుపునిచ్చింది. అదే మల్లన్నసాగర్ బాధితులు ఆందోళన చేస్తే ఇది అభివృద్దిని అడ్డుకోవడమేనంటూ సర్కార్ గొంతుచించుకుంది. ఈ ధోరణి ఎలా ఉందంటే ఏదైనా మేమే చేయాలి....మరెవరూ ఏమీ చేయకూడదు అన్న అహంకార ధోరణి కనబడుతుంది.

జంతర్ మంతర్ ధర్నా చౌక్ ను ఒకవేళ అక్కడి ప్రభుత్వం ఢిల్లీ శివారులోకి తరలిస్తే తన వైఖరేంటో కూడా కేసీఆర్ చెప్పాలి...అయితే ప్రభుత్వాలు ఏవైనా ...ఏ పార్టీ అధికారంలో ఉన్నా...రాజ్యం స్వభావంలో మాత్రం మార్పు ఉండదని స్పష్టం అవుతుంది. పద్నాలుగు సంవత్సరాల పాటు అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించుకున్న టీఆర్ ఎస్ కూడా ఇందుకు మినహాయింపు కాదని తేలిపోయింది.

నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పినా...ఉద్యమ సమయంలో వామపక్షాలను వాటేసుకున్నా...అధికారంలోకివచ్చాక అవేవీ పట్టవని కేసీఆర్ రుజువు చేశారు. ఉద్యమ నాయకుడు ఫక్తు రాజకీయ నాయకుడుగా మారిపోయాడని తేలిపోయింది...రాష్ట్రం ఏర్పడి టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలు చూశాక నేను ఈ అభిప్రాయానికి వచ్చా. మరీ ముఖ్యంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను నగర శివారుకు తరలించడంతో ఉద్యమ నాయకుడిలో దాగి ఉన్న పెత్తందారి స్వభావం నాకు కనబడింది.

గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ..వాటి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన విధానాన్ని విశ్లేషించుకుంటే....ఆయనలో ఎంత మార్పు వచ్చిందో తెలిసిపోతుంది. తమ ప్రభుత్వం ఏం చేసినా అది అభివృద్ది కొరకేనని.....తమ పాలనను ప్రశ్నించేవారందరూ అభివృద్ది నిరోధకులని ముద్రవేస్తున్నారు. తమ వ్యతిరేకులని బలహీన పర్చడం కోసం దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్నారు. కొత్త రాష్ట్రం , కొత్త రాజకీయ విలువలు అమలవుతాయనుకున్న వారికి నిరాశ మిగిలింది. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆశపడ్డవారికి కూడా భంగపాటు తప్పలేదు.

ఉద్యమాలను అణిచివేసే విషయంలో నాణానికి బొమ్మబొరుసులా కేసీఆర్ , చంద్రబాబుల వైఖరి ఉంది. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్పప్పుడు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా ....లుంబీనీ పార్క్ దగ్గర (సెక్రటేరియట్ ఎదురుగా) ఉన్నధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ దగ్గరకితరలించాడు...నేడు కేసీఆర్ ధర్నాచౌక్ ను నగర శివారులోకి తరలించడమే కాకుండా ఉద్యమాలను అణిచివేసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు.ఎన్ కౌంటర్లు, సభలకు అనుమతి నిరాకరించడాలు, లాఠీ ఛార్జీలు, అక్రమ కేసులు పెట్టడంలాంటిచర్యల విషయంలో ...సమైక్య పాలకులకు తమకు తేడా లేదని తేల్చి చెప్పింది.

అధికారంలోకి వచ్చి రాగానే వివేక్ ,శృతి ,సాగర్ ల ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. ఈ ముగ్గురు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారే. ఇది కాసేపటికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా పోలీసులు చేసిన చర్యగా భావిధ్ధాం. అయితే...రాజ్యం అంటేనే పోలీసులు... అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది ఇలా ఉంటే వరంగల్ జైలులో ఉన్న తీవ్రవాది వికారుద్దీన్ తో పాటు మరో నలుగురిని హైదరాబాద్ కోర్టుకి తీసుకువస్తూ దారి మధ్యలోనే బేడీలతో బస్సులో ఉన్నవారందరిని కాల్చి చంపి ఎన్ కౌంటర్ గా కట్టుకథ అల్లినప్పుడే రాజ్యం స్వభావం తేలిపోయింది. ఎవ్వరు అధికారంలో ఉన్నా....ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయినా...రాజ్యం తన పని తాను చేస్తుందని అర్థం అయ్యింది.

ఇక ఉద్యమాల విషయానికి వస్తే...ప్రాజెక్టుల కోసం భూ సేకరణ చేస్తున్న సందర్భంగా జరిగిన ఆందోళనలు ముఖ్యంగా ...మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల విషయంలో ముఖ్యమంత్రి అనుసరించిన విధానం చూస్తుంటే ఆయనలో ఒక్క శాతం కూడా ఉద్యమ నాయకుడి లక్షణాలు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మల్లన్నసాగర్ ముంపు రైతులు తమకు సరైన నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ పోరు బాట పట్టారు. వారికి విపక్షాలు , ఇతర ప్రజా సంఘాలు, జేఏసీ బాసటగా నిలిచాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.

దీంతో సర్కార్ కి ఎక్కడి లేని కోపం కట్టలు తెంచుకుంది.మాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారా....కోర్టుకు వెళతారా అంటూ...రంకెలేసింది. రైతులపై లాఠీలు ఝులింపించారు.భాష్పవాయువు గోళాలు ప్రయోగించింది. కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా తానే రైతులపై లాఠీఛార్జ్ చేయమన్నాని..అవసరమైతే కాల్పులకు కూడా వెనకాడొద్దని పోలీసులకు చెప్పానని నిండు శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.

నాణానికి రెండు వైపులా బొమ్మ, బొరుసు అన్నట్లుగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ లో మరో కోణం ఈ సందర్భంగా ఆవిష్కరించబడింది ప్రాజెక్టుల వల్ల నష్టపోతున్న రైతులకు వ్యతిరేకంగా... ప్రాజెక్టు నిర్మిస్తే తమ పొలాలకు నీళ్లు వస్తాయని ఆశిస్తున్న రైతులను ఉసిగొల్పారు. వారి చేత ప్రాజెక్టులకు అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలు, సభలు పెట్టించారు. రైతుల మధ్య ఘర్షణ పెట్టి రాజ్యం తన స్వభావాన్ని మరోసారి చాటుకుంది. నష్టపోతున్న రైతాంగానికి అండగా నిలబడ్డవారిని అభివృధ్ది నిరోధకులని.... న్యాయం కోసం కోర్టుకు వెళితే... ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విష ప్రచారం చేసింది.

ఉద్యమ సమయంలో తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతుందంటూ సమైక్య పాలకులు చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలను, న్యాయంస్థానంలో వేసిన కేసులను టీఆర్ఎస్ మరిచిపోయింది. అప్పుడు సమైక్య పాలకుల ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగితే.....ఇఫ్పుడు చేపడుతున్న ప్రాజెక్టులు తెలంగాణలోనే ఒక ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతోందన్న సోయి కూడా లేకపోవడం విచారకరం.

అన్యాయం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అన్యాయమే అన్న కనీస జ్నానం ఉద్యమ పార్టీకీ లేకపోవడం శోచనీయం. అన్యాయాన్ని ప్రశ్నిస్తేనే అభివృధ్దిని అడ్డుకోవడమైతే...ఉద్యమ సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా అభివృద్దిని అడ్డుకోవడం అవుతుందా....దీనికి సీఎం కేసీఆరే సమాధానం చెప్పాలి. ఒక ప్రాంత రైతులకు అన్యాయం చేసి ఇంకో ప్రాంత రైతులకు నీళ్లు ఇస్తామని...ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చెప్పినా....స్వరాష్ట్రంలో కేసీఆర్ చెప్పినా...వారి మధ్య తేడా లేదనుకోవాలి.

ఉద్యమాల పట్ల , న్యాయం జరగాలని కోర్టులకు వెళుతున్న వారి పట్ల, రైతులకు మద్దతిస్తున్న విపక్షాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న వైఖరే సీమాంధ్ర పాలకులకు ఉంటే ఏం జరిగేదో...టీఆర్ ఎస్ నాయకులు ఊహించుకుంటే మంచింది.

అదేమంటే తెలంగాణ కోసం నాడు మేము చేసినవన్నీ కరెక్ట్ ..... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విపక్షాలు, రైతులు, ప్రజాసంఘాలు చేస్తునవన్నీ తప్పు అని గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు. ఈ వైఖరి రాజ్యాంగ స్పూర్తికి, ప్రజాస్వామ్య ఆకాంక్షకు భిన్నమైంది. మేము ప్రభువులం..పాలకులం మీరు పాలితులు...మేం చేసింది చూడడం...చెప్పింది వినడమే మీ పని అన్న ధోరణి కనబడుతుంది.

కొత్త రాష్ట్రం, కొత్త విధానాలు అమలు చేయాలి, మూసపోసిన పద్దతులకు స్వస్తిపలకాలి . సమైక్య పాలకుల అనుసరించిన తప్పుడు విధానాలను. వదలించుకోవాలి అని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీకీయ విలువల విషయంలో సమైక్య పాలకులను మరిపించే విధంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలను బలహీనపర్చేందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం. ఇతరత పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకోవడం, ఉద్యమశక్తులను చీల్చడంలో సీమాంధ్ర ముఖ్యమంత్రుల కన్నాఓ అడుగు ముందే ఉన్నారు. తలసానిని కేబినెట్ లో చేర్చుకోవడంతో తను ఫక్తు రాజకీయ నాయకుడినని ...కొత్త రాజకీయ విలువలకు నేను ప్రతినిధిని కాదలుచుకోలేదని చెప్పకనే కేసీఆర్ చెప్పారు. కోదండరామ్ నాయకత్వంలోని జేఏసీనీ చీల్చేందుకు కూడా పథకం రచించారంటే ఏ స్థాయిలో ఉద్యమ శక్తులను బలహీనపరించేందుకు కుట్రలు చేస్తున్నారో..తెలుస్తోంది.కోదండరామ్ లేవనత్తే ప్రశ్నల జోలికి పోకుండా వాటిపై చర్చించకుండా ఆయన కాంగ్రెస్ ప్రతినిధి , రహస్యంగా సోనియాను కలిసాడు ,త్వరలో రాజకీయ పార్టీ పెడుతారు అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగినప్పుడే ప్రభుత్వ బలహీనత అర్థమయ్యంది.ఆయన చేస్తున్న ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంతో కోదండరామ్ రానున్న రోజుల్లో బలీయమైన శక్తిగా ఎదుగుతాడన్న భావన కేసీఆర్ కు ఉందని అర్థమవుతుంది. అందుకే జేఏసీనీ బలహీనపర్చడంతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీయాలన్న ఉద్దేశం కేసీఆర్ లో స్పష్టంగా కనబడుతుంది.

ఉద్యమాలంటేనే సహించే స్థితిలో టీఆర్ ఎస్ సర్కార్ కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ లేరు. అందుకే ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ ను కూడా ఎత్తేశారు. అదేమంటే శాంతి భధ్రతల సమస్య,ఇందిరాపార్క్ దగ్గర ఉన్న కాలనీవాసులు అభ్యంతరాలు చెబుతున్నారనే సాకుతో ...ధర్నాలను నగర శివారులోకి తరలించడం సర్కార్ నిరంకుశ ధోరణికి నిదర్శనం. ఉద్యమాలే ఉండకూడదనుకుంటే తెలంగాణ వచ్చేది కాదన్న కనీస సోయి పాలకులకు లేకపోవడం భాధాకరం. అణిచివేతే సరైన విధానం అనుకుంటే రాష్ట్రాని సాధించగలిగే వాళ్లం కాదన్న స్పృహ కేసీఆర్ కు లేకపోవడం శోచనీయం. ధర్నా చౌక్ ఎత్తివేయడంపై ఇప్పటికే అన్ని పక్షాలు తమ నిరసనను తెలియజేసి, గవర్నర్ దృష్టికి తీజుకెళ్లాయి . అంతటితో సరిపుచ్చుకోకుండా ఈ చర్యపై ప్రజల్లోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక్క వాస్తవాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. చరిత్రలో ఎక్కడా అణిచివేతల ద్వారా ఉద్యమాలను అదుపు చేసిన దాఖలు లేవు. అందుకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే ఓ ఉదహారణ. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతాం....ఎదురించే వారి తాట తీస్తామన్న ధోరణి అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్య ఆకాంక్షకు వ్యతిరేకం. అసెంబ్లీలో మేము చెప్పిందే వినాలి...ఎదురు తిరిగితే, ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. చివరకి పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడింది.సహచర మంత్రులకు కనీస విలువ ఇవ్వకుండా అవమానపరిచని సందర్భాలు అనేకం ఉన్నాయి.సంబంధిత మంత్రి లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షలు నిర్వహించడం, తనను కలవడానికి వచ్చిన మంత్రులను అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించిన దాఖలాలు అనేకం. కొందరు మంత్రులనైతే క్యాంపు ఆఫీసు మొయిన్ రోడ్ నుంచే సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతుంది.తాను తన కుమారుడు చెప్పినదే వినాలి తప్పా... మంత్రులు చెప్పింది వినాల్సింది అవసరం లేదని అధికారులకు సంకేతాలు ఇచ్చారని తెలుస్తుంది. తెలంగాణ సమాజం దేనినైనా భరిస్తుంది కాన అణచివేతను,అవమానాన్ని ఒక్క క్షణం కూడా భరించలేదన్న నగ్న సత్యాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకుంటే మంచిది…

Tuesday 11 April 2017

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి 10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే భాద్యతలను కలెక్టర్ లకు సీఎం కెసిఆర్ గారు అప్పగించారు..!!

ఇది 2019 ఓటు బ్యాంకు కోసం జరుగుతున్న మరో కుట్ర.
10 లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి కావలిసిన బడ్జెట్ సుమారు 60 వేల కోట్లు(ఒక్కో ఇంటికి 6 లక్షలు) ఇంటి స్థలాల ఖర్చు అదనం.
తె రా స ప్రబుత్వం చివరి బడ్జెట్ లో పెట్టింది వెయ్యి కోట్లు ఈ లెక్కన 10 లక్షల ఇండ్లు కట్టడానికి 60 సంవత్సరాలు కావాలి.
మరి ఇప్పుడు 10 లక్షల మంది లబ్ది దారులను ఎందుకు ఎంపిక చేస్తున్నారు ?
2019 ఎలక్షన్లలో ఓటు వేయకుంటే మీకు ఇండ్లు రావని చెప్పి ఓట్లు వేయించుకోవడానికి.
ఇంటికి నాలుగు ఓట్లనుకున్న 40 లక్షల ఓట్లు ఖాయం.
As such kCR conducted Samagra Survey, with that data can govt not identify the beneficiaries,, why this thamaashaa.?
Is this not cheating of innocent people??

Saturday 1 April 2017

#ధర్నా_అంటే_దడ_ఎందుకు?

Is #TRS Govt Scared of Dharna Chowk? Shifting is an attempt 2 Suppress People's Voice .!
ఈరోజు ఆంధ్రజ్యోతి లో ఎడిట్ పేజీ ఆర్టికల్

Is #TRS Govt Scared of Dharna Chowk? Shifting is an attempt 2 Suppress People's Voice .!

ధర్నా అంటే దడ ఎందుకు? ధర్నా చౌక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి నిర్ద్వందంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. 
ప్రజా గొంతుకలకు వేదికైన ధర్నా చౌక్ ని ఎత్తివేయొద్దని మన ముఖ్యమంత్రి గారికి వినిపించేంతవరకు, తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు నినదించండిఎలుగెత్తిచాటండి
ఈరోజు ఆంధ్రజ్యోతి లో ఎడిట్ పేజీ ఆర్టికల్