Monday 22 April 2019

ఇంటర్‌ పరీక్షల అక్రమాలపై న్యాయ విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌ :ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌


Ø ఇంటర్పరీక్షల అక్రమాలపై న్యాయ విచారణకు కాంగ్రెస్డిమాండ్
Ø మంత్రి జగదీష్రెడ్డి మన్నాబాయ్ఎంబీబీఎస్గా అభివర్ణించిన కాంగ్రెస్నేత దాసోజు శ్రవణ్
Ø మంత్రివర్గం నుంచి జగదీష్రెడ్డిని బర్తరఫ్చేయాలని డిమాండ్
Ø బాధిత విద్యార్థుల సహాయం కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని పట్టు
Ø ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ఇంటర్‌ బోర్డు ఘోరంగా వైఫల్యం చెందిందని, అందుకు బాధ్యులపై బోర్డుతోపాటు గ్లోబ్‌ ఎరినా టెక్నాలజీస్‌ తప్పిదాలపై హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయవిచారణకు ఆదేశించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

న్యూఢిల్లీలోని అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ (ఏఐసీసీ) కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ బోర్డు నిర్వహించిన నిర్వాకానికి వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దారుణంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇందుకు బాధ్యులైన బోర్డు అధికారులు, తప్పుదారిపట్టిన వారిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అసమర్ధత కూడా బయటపడిందని, ఆయన మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌ తరహా మాదిరిగా పలవాల్సివస్తోందని ఎద్దేవా చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్‌ స్పందించి జరిగిన తప్పుకు బాధ్యుడైన మంత్రి జగదీష్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. 
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం అడుతోందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసికక్షోభకు గురిచేశారని, ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని శ్రవణ్‌ హెచ్చరించారు. వేలాది మంది భవిష్యత్‌ను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు  కారణం అవినీతి వేళ్లూనుకుపోవడమేనని, ఇంటర్‌ బోర్డు అవినీతి, తప్పిదాల వల్లే ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నివేదికలు అందుతున్నాయని, వారి కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోవేదనను గుర్తించని ఇంటర్‌బోర్డు/ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బోర్డు తప్పు చేసి ఇప్పుడు విద్యార్థులను డబ్బులు కట్టుకుని రీవ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రీకౌంటింగ్‌కు వంద రూపాయలు, రీవ్యాల్యుయేషన్‌కు ఆరు వందలు చెల్లించి రీవ్యాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మొత్తం తప్పు తామేమీ చేయలేదని బోర్డు చెప్పడం క్షమించరానిదని నిప్పులు చెరిగారు. విద్యార్థుల నుంచి ఆ మొత్తం వసూలు చేయకుండా ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. 
వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తేగానీ మంత్రి జగదీష్‌రెడ్డి నిద్ర మేల్కొనలేదని, ప్రభుత్వం కూడా ఆ తర్వాతే సమీక్ష చేసిందని తప్పుపట్టారు. నిద్ర లేచిన మంత్రి నైతిక బాధ్యతతో మంత్రిపదవికి రాజీనామా చేయలేదని, కంటినీటి తుడుపు చర్యగా ఒక కమిటీని ఏర్పాటు చేశారని, ఈ కమిటీ వల్ల ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు తిరిగి రారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయినా బాధ్యతను గుర్తించి మంత్రిని క్యాబినెట్‌ నుంచి తొలగించాలని పట్టుబట్టారు. ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని అధికారపార్టీలోకి రాక్కునేందుకు వలసలకు పెద్ద పీట వేస్తోందని ఆరోపించారు. 

నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరీనా టెక్నాలజీస్‌కు కాంట్రాక్టు

ఈ తప్పిదాలమీ యాధృచ్ఛికంగా జరిగినవి కావని, మానవ తప్పిదాలు, కావాలని చేసిన వాటి వల్ల జరిగిందని, చట్ట నిబంధనల్ని అనేకసార్లు తుంగలోకి తొక్కడం వల్ల జరిగిందని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. 2017–18 విద్యా సంవత్సరం వరకూ ఇంటర్‌ బోర్డు పనిని రెండుగా విభజించి చేసిందని, తొలి వింగ్‌లో ప్రవేశాలు, ఎన్ఆర్‌ జనరేషన్, పరీక్షల కేంద్రాల కేటాయింపు వంటి వాటిని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ద్వారా చేసేదని, పరీక్ష  ఫలితాల వెల్లడి వంటి కీలక పనులు అత్యంత అనుభవం ఉన్న ప్రైవేట్‌ ఏజెన్సీలు చేసేవన్నారు. అయితే ఇప్పుడు ఇంటర్‌ బోర్డు ఆ విభాగాల పనుల్ని విలీనం చేయడం వల్ల తప్పులకు తెర తీసినట్లు అయిందన్నారు. 2017 సెప్టెంబర్‌ 25న నెం 23/ఇడిపి/2017–18 ద్వారా రెండు విభాగాల పనుల్ని కలిపి చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ద్వారా డిజైన్, డవలప్‌మెంట్, వెబ్‌పేజీ అప్లికేషన్‌ నిర్వహణలను ఒకరే చేసేలా చట్ట నిబంధనల్ని మార్చేశారని, బోర్డు బిజినెస్‌ అంతా దీని ద్వారా జరిగేలా చేశారని, దీంట్లో ప్రవేశాలు, ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్‌ ఎగ్జామినేషన్, రిజల్స్‌ పోసెస్, ఓఎంఆర్‌ స్కానింగ్‌ వంటివి ఉన్నాయని దాసోజు శ్రవణ్‌ వివరించారు. సాంకేతిక అర్హత, ఆర్థిక ప్రయోజనం బట్టి గ్లోబరీనా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన కంపెనీకి ఆ పనుల ఆర్డర్‌ ఇచ్చేశారని తప్పుపట్టారు. అయితే బోర్డు జారీ చేసిన టెండర్‌ నిబంధనల ప్రకారం ఆ కంపెనీ లేదని, అర్హత సాధించాలన్న ఐటెమ్‌ 3లో 11 అర్హతల అంశాలున్నాయని, దాంట్లో ఆరు, ఏడు అంశాలు ఆ కంపెనీకి లేవని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. గత అయిదు విద్యా సంవత్సరాల్లో మూడు లక్షల మందితో ఉన్న బోర్డుగానీ లేదా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలోగానీ టెక్నాలజీబేస్‌ సొల్యూషన్స్‌ చేసుండాలని, ఈ విధంగా గ్లోబరీనా చేయలేదన్నారు. ఏడో నిబంధనలో కనీసం అయిదు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలుగానీ, అయిదు ప్రభుత్వ బోర్డులోగానీ చేసుండాలని, వీటిలో కనీసం రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ఉండితీరాలన్న నిబంధన ప్రకారం కూడా ఆ కంపెనీకి అర్హత లేదన్నారు. మూడు లక్షల మంది విద్యార్థులు ఉండాలన్న నిబంధనకు విరుద్ధంగా గ్లోబరీనా టెక్నాలజీస్‌ కాకినాడ జేఎన్‌టీయూ పరిథిలోని కాలేజీలను  08–09–2019 నాటికి లెక్క తీసుకుంటే రెండున్నర లక్షల మంది మాత్రమే విద్యార్థులున్నాయని శ్రవణ్‌ వివరించారు. ప్రీ, పోస్ట్‌ ఎగ్జామినేషన్స్‌లో పనిచేశామని ఆ సంస్థ చెబుతున్నా వాస్తవానికి ఆన్సర్స్‌ షీట్ల ఆన్‌లైన్ల మాల్యాంకనం మాత్రమే చేసిందన్నారు. మరీదారుణమైన విషయం ఏమిటంటే ఇతర భాగస్వాములతో కొన్ని పనులు చేశారని, ఇలాంటి అర్హత లేని కంపెనీకి బాధ్యతలు ఇచ్చి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఇంటర్‌బోర్డు ఆటలాడుకుందని నిప్పులు చెరిగారు. 
ఏడో నిబంధన ప్రకారం అయిదు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేదా అయిదు ఇంటర్‌ బోర్డుల్లో పనిచేయాలనే నిబంధనను కూడా ఉల్లంఘించే ఆ కంపెనీకి పనులు ఇచ్చారని, ఈ విషయాల్ని ఆ కంపెనీ సమర్పించిన పత్రాలే నిదర్శమన్నారు. గ్లోబరీనా టెక్నాలజీ దేశంలోని ఏ ఇంటర్‌ బోర్డులోనూ పనిచేయలేదని, తెలంగాణ బోర్డులో కేవలం 20 వేల మంది విద్యార్థుల రీయవాల్యుయేషన్‌ చేసిందని, తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఇచ్చిన పత్రాన్నే పట్టుకుని ఇంత భారీ కాంట్రాక్టు పొందేసిందని, దీని వెనుక భారీ కుంభకోణం దాగిఉందని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు.
ఆరు, ఏడు టెండర్‌ నిబంధనలు వర్తించకపోయినా ఇంటర్‌ బోర్డు గ్లోబరీనా టెక్నాలజీస్‌కు కాంట్రాక్టు ఇచ్చేసిందని, కాంట్రాక్టును 2018–19 మొత్తానికి ఇచ్చినప్పుడు 2017–18 విద్యా సంవత్సర ఫలితాలపై పైలెట్‌ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో విధిగా చేయాలన్న నిబంధనను సైతం తుంగలోకి తొక్కేశారని శ్రవణ్‌ నిప్పులు చెరిగారు. ఆ ఫలితాలు, పైలెట్‌ ప్రాజెక్టు ఫలితాలు సరిపోయినప్పుడు మాత్రమే  ఆ తర్వాత ఏడాదికి అంటే 2018–19కి ప్రాజెక్టు పనులు ఇవ్వాలని, ఇలా ఏమీ చేయకుండానే టెండర్‌ నిబంధనల్ని తుంగలోకి తొక్కి చేసేశారని, ఫలితంగా విద్యార్థులు వేలాదిగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైలెట్‌ ప్రాజెక్టు చేయకపోయినా ఫర్వాలేదంటూ ఇంటర్‌ బోర్డు అధికారికంగా అనుమతి ఇవ్వడం మరీదారుణమని మండిపడ్డారు. ఆ కంపెనీ డిజైన్‌ దాఖలు చేయడంగానీ దానిని బోర్డు ఆడిట్‌ చేయడంగానీ చేయలేదని, సగం రోజుల వరకూ గేట్‌వేను ప్రారంభించలేదని, దాంతో విద్యార్థులు ఫీజు చెల్లింపునకు సైతం సమస్యల్ని ఎదుర్కొన్నారని, ఫలితంగా రెండు సార్లు ఫీజు చెల్లింపు గడువును రెండుసార్లు పెంపు చేశారని దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. బోర్డు ఉన్నతాధికారి డాక్టర్‌ ఎ.అశోక్‌ బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారేగానీ స్పందించలేదని, ఆయనపై అనేక అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు.
 పరీక్షా పత్రాలు లీక్‌ అయ్యాయి.. జవాబుపత్రాలు మిస్‌ప్లేస్‌ అయ్యాయి.. అయినా చర్యలు లేవు.. అన్ని సెట్ల పశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి.. ఫలితాలు వెల్లడించేందుకు 20 రోజుల సమయం అవసరమైతే కేవలం పదిరోజుల్లోనే పూర్తి చేశారు.. రోజుకు 30 పత్రాల్ని దిద్దాల్సిఉండగా 60 పత్రాల్ని దిద్దారు.. హాజరైన విద్యార్థులు గైర్హాజరు అయ్యారని.. 90 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని చూపించారు... ఎంపీసీ విద్యార్థికి ఎకనామిక్స్‌ మార్కుల షీటు ఇచ్చారు.. ఇన్నితప్పులు జరిగినా బోర్డు తన తప్పిదాల్ని ఒప్పుకోకుండా డబ్బులు చెల్లించి పరీక్ష పేపర్ల తిరిగి మూల్యాంకనం చేయించుకోవాలని చెప్పడం దారుణం. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ స్పందించాలి. సంబంధిత మంత్రి జగదీష్‌రెడ్డిని క్యాబినెట్‌ నుంచి భర్తరఫ్‌ చేయాలి. ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి. ఈ మొత్తం దారుణాలపై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణకు ఆదేశించాలి.. అని డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 







No comments:

Post a Comment