Sunday 18 November 2018

పదిహేను రోజులు నాకోసం వెచ్చించండి... జీవితాంతం మీకోసం కష్టపడుతానన్న శ్రవణ్ దాసోజు

ఓడిపోతానన్న భయంతోనే  దానం నాగేందర్ తనపై ఆరోపణలు చేసారని వెల్లడి.
దానం అంటే దందాలు, దానం అంటే దళారితనం...కబ్జాలు చేయడమేనని ఎద్దేవా
ప్రజా సమస్యల కోసం ప్రాణమివ్వడమే తప్ప..గూండాయిజం తెలియదన్న శ్రవణ్
పదిహేను రోజులు నాకోసం వెచ్చించండి... జీవితాంతం మీకోసం కష్టపడుతానన్న శ్రవణ్ దాసోజు
పీ జే ఆర్ కంచుకోట ఖైరతాబాద్ కు తనను రక్షకుడిగా పంపిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్నుడిగా ఉంటానని ప్రతిజ్న.
రేపు ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేయనున్న డాక్టర్ శ్రవణ్ దాసోజు.
ఫిల్మ్ నగర్ రాజరాజేశ్వరీ దేవాలయం నుంచి భారీ ర్యాలీ గా తరలిరావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు.
సాధించిన విజయాలతో కూడిన కరపత్రాన్నిగాంధీభవన్ లో ఆవిష్కరించిన దాసోజు


రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక దానం నాగేందర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, టీపిసిసి కాంపైన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. తన పన్నెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి నిత్యం ప్రజాసమస్యల కోసం పోరాటం చేశానని ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడానన్నారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పాల్గొన్న డాక్టర్ శ్రవణ్  గత నాలుగున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్దత కల,నిఖార్సయిన  సైనికుడిలా పనిచేస్తున్న తనకు హైదరాబాద్ కు తలమానికమైన ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని,పార్టీ హైకమాండ్ తనకు  అప్పగించిందని  వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా శక్తి వంచన లేకుండ  కృషి చేసి నియోజక వర్గ ప్రజలందరి మన్ననలతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పీజే ఆర్ కంచుకోట ఖైరతాబాద్
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం దివంగత నేత పీ జనార్ధన్ రెడ్డిగారి కంచుకోట లాంటిదని అలాంటి నేత కంచుకోటకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలతో రక్షకుడిగా ఉండే అవకాశం తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని  శ్రవణ్ భావోద్వేగంతో అన్నారు. పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిని పీజెఆర్ స్ఫూర్తితో వారి ఆశయాలకోసం జీవితాంతం పోరాడుతానని ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కి వస్తున్న ఆదరణతో మతి భ్రమించిన దానం
తనకు టికెట్ వచ్చిన కొద్దిగంటల్లో గత కాంగ్రెస్ పార్టీ నాయకుడు దానం నాగేందర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని, రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి దానం నాగేందర్ కు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు.
రాజకీయం అంటే గూండాయిజం కాదు
రాజకీయం అంటే గూండాయిజం కాదని రియల్ ఎస్టేట్ దందాలతో రాజకీయం చేయడం తనకు తెలియదని శ్రవణ్ దాసోజు విమర్శించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నత చదువులు చదువుకుని లక్షల రూపాయల జీతం వచ్చే  ఉద్యోగాన్ని వదులుకుని ప్రజాసేవ చేసేందుకు వచ్చానన్నారు. ఎన్నికల్లో నోట్ల కట్టలు వెదజల్లి ఓట్లు దండుకునే రాజకీయం తెలియదన్నారు. ప్రజలకోసం ప్రాణమివ్వడమే తెలుసన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన  11 సంవత్సరాలుగా తెలంగాణా ఉద్యమం కోసం ప్రాణాలకు తెగించి కోట్లాడానన్మారు. 24 గంటలు ఉద్యమ గొంతుకగా పనిచేసానని పైరవీలు దందాలు చేసి పైకిరాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కష్టపడి పైకొచ్చిన తనకు పార్టీ కి చేసిన సేవకు గుర్తింపుగా కాంగ్రెస్ హైకమాండ్ సీటు కేటాయించిందని కోట్ల రూపాయలు చేతుల మార్చి సీటు పొందాల్సిన అవసరం తనకేంటన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కు తలమానికం ఖైరతాబాద్ నియోజకవర్గం
రాష్ట్రం ఏర్పాటయి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణా ఎందుకు తెచ్చుకున్నమనుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గముందని ,
తనకు అవకాశమిస్తే తెలంగాణా అంతా గర్వపడే రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ది పరుస్తానని
శ్రవణ్ హామీ ఇచ్చారు.
మామూలు డ్రైవర్ కు వేల కోట్లు ఎక్కడివి
డ్రైవర్ గా జీవితం ప్రారంభించిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవితో సహా ఎన్నో పదవులు అనుభవించి  వేల కోట్లు సంపాదించుకుని తల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన తరహాలో తన అక్రమ సంపాదన అడ్డగోలు భూకబ్జాలనుంచి రక్షించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ చంకలో చేరాడని  తీవ్ర విమర్శలు చేశారు.
పీజేఆర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు
ప్రజల మనిషిగా, పేదల గుండెల్లో కొలువైన నికార్సయిన కాంగ్రెస్ పార్టీ సైనికుడు దివంగత నేత పీజెఆర్ గారిని మానసికంగా వేధింపులకు గురిచేసిన దానం, ఆయన విగ్రహానికి దండవేసే అర్హత, విగ్రహాన్ని తాకే అర్హత లేదన్నారు.  ఆయనవిగ్రహానికి దండేస్తే ప్రజలను మభ్యపెట్టొచ్చని దానం భావిస్తే అది ఆయన మూర్కత్వానికి పరాకాష్ట అవుతుందని ఎద్దేవా చేశారు.వందల కోట్లు రూపాయలు ఖర్చు చేసినా గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.  గులాబీ పార్టీకి గులాముగా మారిన దానం వెంట దాదాగిరి గూండాగిరి ఉంటే తనవెంట నికార్సయిన కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ సైన్యం ఉందన్నారు.
ఖైరతాబాద్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ధీమా
మహాకూటమి తరుఫున కాంగ్రెస్ పార్టీ జెండా అసెంబ్లీ పై  ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తనను ఎదుర్కోలేక పిచ్చికూతలు కూస్తున్న దానం ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నరు. తన స్వలాభం కోసం  టీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు గతంలోనే కేసీఆర్ ఫ్లెక్సీలు కట్టిన దానం ఏ నాడూ కార్యకర్తలకు అందుబాటులో లేరన్నారు. కారు అద్దాలు తీయడని, అలాగే కళ్లద్దాలు తీయడని ఎద్దేవా చేశారు. పీజేఆర్ ఆశయాలను బతికించేందుకు నిత్యం ప్రజల మధ్య ఉండే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్నప్తిచేశారు.
రేపు ఉదయం పది గంటలకు నామినేషన్
రేపు ఉదయం పదిగంటలకు ఫిల్మ్ నగర్ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి భారీ ర్యాలీ గా వెళ్ళి నామినేషన్ వేయనున్నట్లు శ్రవణ్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్ సీపిఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దయెత్తున తరలిరావాలని శ్రవణ్ విజ్నప్తి చేశారు. ఉద్యమ ద్రోహులకు ఉద్యమ నేతలకు మధ్య జరుగుతున్న పోరాటంలో రాహుల్ గాంధీ ఆశీస్సులతో కాంగ్రస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు,
శ్రవణ్ వెంట ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు మధుకర్ యాదవ్ ,నిరంజన్, మహేశ్ యాదవ్,ప్రకాశ్, కరీం, ఇర్ఫాన్ తదితర నేతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment