Wednesday 24 May 2017

#ప్రమాదంలో_పోలీస్_వ్యవస్థ




పాలకులు, ప్రభుత్వాలు, రాజకీయాలు తాత్కాలికం, కానీ వ్యవస్థలు శాశ్వతం. తమ నియంతృత్వాన్ని కొనసాగించేందుకు కీలకమైన వ్యవస్థల్ని సైతం నిర్వీర్యంచేసే విధంగా పాలకులు వ్యవహరిస్తే, భావి తరాలకు అన్యాయం చేసినట్లే.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అట్టహాసంగా మీడియా ఆర్భాటంతోలా అండ్ ఆర్డర్‌కు సంబంధించి ఎస్సై నుంచి డీజీపీ దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని స్థాయిల అధికారులు కోసం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం విన్న తర్వాత ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహించిండ్రో, ఏ లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రసంగించిండ్రో, ఆ సమావేశంలో ఉన్న పోలీసులకు ఏం అర్థం అయ్యిందో తెల్వదు కానీ, ఒక సామాన్య విశ్లేషకుడిగా ఒక్కటి మాత్రం నాకు స్పష్టమయ్యింది. రానున్న సాధారణ ఎన్నికల్లో పోలీసులందరూ ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా పనిచేయాలని, టీఆర్‌ఎస్‌కు ప్రజలతో ఓట్లు వేయించే ఏజెంట్లుగా పనిచేయాలని సీఎం నర్మగర్భంగా మార్గదర్శనం చేసినట్లు కనిపించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పోలీసులనుద్దేశించి రాజకీయ ప్రసంగాలు చేయడం వెనుక ముఖ్యమంత్రికున్న స్పష్టమైన స్వార్థ ఎన్నికల ఎజెండా కనపడింది. సమావేశంలో ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, విద్యుత్ రంగంలో సాధించిన విజయం గురించి, టీఎస్ ఐపాస్ తేవడం ద్వారా పెద్ద ఎత్తున రానున్న పెట్టుబడుల గురించి మాట్లాడారు. అటు ముఖ్యమంత్రి పోలీసు అధికారులను, ఇటు పోలీసు అధికారులు ప్రభుత్వాన్నీ ముఖ్యమంత్రినీ పొగడటం కోసం అన్ని లక్షల ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహించిన ఈ సమావేశం ఓ స్వార్థ రాజకీయ ప్రహసనం మాదిరిగా కనిపించింది.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఎక్కడా పోలీసు పటిష్ఠతను పెంపొందించే అంశాన్ని గానీ, శాంతిభద్రతల గురించి గానీ, పోలీసులు సామాన్య ప్రజల పట్ల అనుసరించాల్సిన విధానం గురించి గానీ, లాకప్ డెత్‌ల గురించి గానీ, మానవ హక్కులకు విఘాతం కలుగకుండా పోలీస్ విధి నిర్వహణ ఎలా చేయాలని గానీ, పోలీసులలో పెరుగుతున్న అవినీతి గురించి గానీ, సివిల్ డిస్ప్యూట్స్‌లలో తలదూర్చే అంశం గురించి గానీ, భూ దందాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయం గురించి గానీ, వారు పాటించాల్సిన నియమనిబంధనల గురించి గానీ, ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఒత్తిడికి గురవుతున్న కింది స్థాయి అధికారులకూ కానిస్టేబుళ్ళకూ కావాల్సిన సాంత్వన గురించి గానీ, రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సై స్థాయి అధికారులు చేసుకున్న ఆత్మహత్యల గురించి గానీ, పోలీసు అధికారులకు ఉండాల్సిన విలువల గురించి గానీ, వారి పని తీరు ఇంకా ఎలా మెరుగుపర్చుకోవాలి అన్నదాని గురించి గానీ ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు.

ఇటీవల ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ప్రభుత్వమే మొదలు రైతులను రౌడీలు అని విమర్శించింది. అయితే ప్రజల తిరుగుబాటు చూసి, ఈ ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రే ఘాటుగా స్పందించారు. ధర్నా చౌక్ సందర్భంగా జరిగిన ఆందోళనలో, కౌంటర్ ఉద్యమం కోసం ప్రభుత్వమే ప్రేరేపించిందో లేదో తెలియదు కానీ, ఓ మహిళా సీఐ, కొంత మంది కానిస్టేబుళ్లు స్థానికుల వేషంలో ప్లకార్డులు పట్టుకొని ధర్నా చౌక్ ఎత్తివేయాలని దీక్షలో పాల్గొనడం మనం చూసాం. తీరా మీడియా పోలీసుల పాత్రను బహిర్గతం చేయడంతో ఆమెపై చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ సందర్భంగా పోలీసులకు, ప్రభుత్వానికి సమన్వయం లేదనేది స్పష్టంగా కనపడ్డది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత గూర్చి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించలేదు.

రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న నయీం వ్యవహారంలో పోలీసుల పాత్ర గురించి గుర్తుచేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించలేదు. బహుశా ఆ అంశాన్ని కదిపితే ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుపై ఉన్న అనుమానాలు, ఆ కేసుల నుంచి తప్పించుకున్న కొంతమంది ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులు, స్వంత పార్టీ నాయకుల గురించి ప్రజలు లేనిపోని విధంగా ప్రశ్నిస్తరేమోనని కేసీఆర్ భయపడ్డడో తెలియదు.

ముఖ్యమంత్రి కేవలం ఇద్దరు అధికారులను నమ్ముకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొంబై తొమ్మిది కార్పొరేటర్ల స్థానాలు గెలుచుకున్నామన్నారు. ఓ పక్క జూనియర్ ఆఫీసర్స్‌ని పొగుడుతూ, ప్రస్తుత పోలీస్ బాస్ డీజీపీ గురించి ఎక్కడా ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. తద్వారా అతని మనో ధైర్యం దెబ్బదీసిండు. రాజకీయ అవకాశవాదంతో, తన పార్టీలో ఒకళ్ళ స్థాయిని తగ్గించేందుకు, ఇంకొకళ్ళను పొగడటం ఒప్పుకోవచ్చేమో కానీ, పూర్తిగా హైరార్కీకల్ సంస్థ అయిన పోలీస్ వ్యవస్థ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి సమంజసం కాదు.

ఓ ఇద్దరు అధికారుల చలువ వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపొందామంటే, ఓట్లు వేసిన ప్రజలు పిచ్చోల్లా లేక ఆ ఇద్దరు పోలీసులు ప్రజలను బెదిరించి టీఆర్‌ఎస్‌కు ఓట్లు ఏయించిండ్రా? ముఖ్యమంత్రి మాటలు బట్ట కాల్చి మీద వేసినట్లు ఉంది. ఆ ఇద్దరు పోలీసుల పేర్లు వాడుకుని, వ్యూహాత్మకంగా మొత్తం తెలంగాణ పోలీసు వ్యవస్థ యావత్తు గులాబీ కండువా కప్పుకున్నట్లు బ్రాంతి కల్పించిండు.

పోలీసుల చలువ వల్ల గెలిచామన్న మాటలను ప్రజలు నమ్మి, పోలీసులను తెరాస ఏజెంట్లు అని అనుకుంటే, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పిందే నిజమైతే, పోలీసులు నిజంగా వారి పదవిని, హోదాను, వారి చేతిలో ఉన్న ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్‌కు మద్దతుగా పనిచేస్తే, మాకు మంచి పోస్టింగ్స్ వస్తాయనీ; ముఖ్యమంత్రి, ఇంకా టీఆర్‌ఎస్‌ పెద్ద నాయకులచే బహిర్గతంగా అభినందనలు, పొగడ్తలు లభిస్తాయనీ మిగతా పోలీసు అధికారులు భావిస్తే, భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లుతుంది. ఇంత పెద్ద పోలీసు సమావేశంలో, నిజాయితీగా తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్న పోలీసుల గురించి ప్రస్తావించలేదు. అంతెందుకు భారత రాష్ట్రపతి ద్వారా అతి ప్రతిష్ట కలిగిన శౌర్య చక్ర అవార్డు గ్రహీత, పోరాడి తీవ్రవాదులను పట్ట్టుకున్న కె.శ్రీనివాస్‌ని అభినందించడంతో పాటు ఘనంగా సన్మానించి ఉంటె తోటి తెలంగాణ పోలీసులకు స్ఫూర్తి దాయకంగా ఉండేది. నల్లగొండ జిల్లాలో సిమీ తీవ్ర వాదుల చేతుల్లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుల గూర్చి ప్రస్తావన లేదు. ఎంత సేపటికి, ఓ ఇద్దరు ముగ్గురు అధికారుల పని తీరు ఇంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉంది అని స్వయంగా ముఖ్యమంత్రే తన ప్రసంగంలో వారిని కొనియాడి, ఏళ్ళ తరబడి నిబద్ధతతో పనిచేస్తున్న ఇతర పోలీసు అధికారులను ఆత్మన్యూనత భావంలో పడవేసిండు. అయితే కేసీఆర్ యాదృచ్ఛికంగా ఈ ప్రసంగం చేసిండ్రని మనం అనుకోలేం. ఎందుకంటే, కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ లక్ష్యం, వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది.

సమావేశానికి హాజరైన అధికారులందరిని తమ అభిప్రాయాలను స్పష్టంగా రాసి అక్కడ ఉంచిన బాక్స్‌లో వేయాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరారు. అయితే ఇంటర్నల్‌గా ఇచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు, వారి దందాలపైనా, టీఆర్‌ఎస్‌, కేసీఆర్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం పైనా... ఇందులో రాయాల్సిందిగా సూచించిండ్రట. ఇందులో కూడా నిఘా రాజకీయం ఉంది. స్వంత పార్టీ ప్రజాప్రతినిధులపై తనకు నమ్మకం లేదు, నాకు కేవలం మీపై అంటే పోలీసులపై మాత్రమే నమ్మకం ఉంది అనే సంకేతం పంపిండు. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో దుర్మార్గమైన అవినీతి పెరిగిపోయిందని, దానిని అరికట్టడానికి ఐపీఎస్ అధికారైనప్పటికినీ, ఐఏఎస్ పోస్టులో సెంట్రల్ సర్వీస్‌కు పోతానన్న ఓ అధికారిని బ్రతిమాలి సివిల్ సప్లై కార్పొరేషన్‌లో నియమించామని చెప్పడమంటే, సహచర కేబినెట్ మంత్రి ఈటెల రాజేందర్ పనితీరు మీద విశ్వాసం లేదని, అతడు అవినీతిని అరికట్టలేని అసమర్థుడు అని చెప్పకనే చెప్పిండు.

మరోవైపు హోంశాఖా మాత్యులు నాయిని నర్సింహారెడ్డి తన శాఖపై సరిగ్గా దృష్టి పెడితే, తాను ఆ సమయాన్ని ఇతర అంశాలకు ఉపయోగించుకుంటానని అన్నారు. అంటే నాయిని నర్సింహారెడ్డి తన శాఖపై దృష్టిపెట్టడం లేదని పరోక్షంగా చెప్పిండు. అదే విధంగా, ఎక్సైజ్ శాఖకు సంబంధించి గుడుంబా నియంత్రణ విషయంలో కూడా కనీస అధికారాలు, ఆయుధాలు లేకుండా పనిచేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని విస్మరించి ఒకే అధికారిని పొగడ్తలతో ముంచెత్తిండు. ఆ సమావేశంలో కేసీఆర్ వ్యవహార శైలి చూస్తే, సహచర మంత్రుల కన్న, కేవలం అధికారులకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు, తనకు వారిపైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్లు కనబడుతుంది. ప్రస్తుత మంత్రులు కేవలం రబ్బర్ స్టాంపులుగా చలామణి అవుతున్నారని, అసలు ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువలేదని జరుగుతున్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

పెట్టుబడులు రావాలంటే శాంతిభధ్రతలు బాగుండాలని, అందుకోసం పటిష్ఠ‌ంగా పోలీసులు పనిచేయాలని మాత్రమే కోరారు. అయితే ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు, నిరసన తెలిపే హక్కుకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన భాధ్యత కూడా పోలీసులుపై, ప్రభుత్వంపై ఉంటుంది. కానీ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం, పోలీసుల అనుసరిస్తున్న విధానం నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఉంది. మల్లన్నసాగర్ ఉద్యమ సందర్భంగా, గౌలివాడలో, ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ చేపట్టే సందర్భంగా, ఖమ్మం మిర్చి రైతుల పట్ల అనుసరించిన వైఖరి, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఉదంతంలో ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన విధానం గర్హనీయం.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో పోలీసులు తోడ్పడ్డారని, అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలిపినారు. ఆనాడు పోలీసులంతా ఉద్యమానికి మద్దతు ఇచ్చింది నిజమే అయితే, ఉద్యమకారులపై అనుచితంగా లాఠీచార్జి చేసి గొడ్లను బాదినట్లు బాది, తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెట్టింది ఎవరు? కీలకమైన సమయాలలో ఉద్యమానికి నిజంగా వెన్నుదన్నుగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులని తెలంగాణ వచ్చినంక, వారిని కీలక పదవుల నుంచి తప్పించి, లూప్ లైన్ పోస్టింగ్స్ ఇచ్చి, ఉద్యమ కాలంలో ఆనాటి పాలకవర్గం అడుగులకు మడుగులు వత్తుతూ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రలు చేసిన వారికే మంచి మంచి పోస్టింగులు ఇచ్చి, వాళ్లు మాత్రమే గొప్ప పనులు చేస్తున్నట్లు, తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వడం విస్మయం కలిగించింది. ప్రభుత్వ పాలన అంటే ఏ వ్యక్తి స్వంత వ్యవహారం కాదు. ముఖ్యమంత్రికి విపక్షాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు చెప్పేవి వినడం ఇష్టం లేదు. తనకు తానా అంటే తందానా అనే కొందరు కవులు, కళాకారులను, జర్నలిస్టులను, ఉద్యోగులను పిలిపించుకొని సమావేశాలు నిర్వహించడం ఆయనకే చెల్లింది. తనకు ఊ కొట్టే పోలీసు అధికారులు పదవీ విరమణ చేసినా వారికి, ప్రభుత్వానికి దాసోహంగా ఉంటారనేమో తెలియదు కానీ, నిబంధనలకు వ్యతిరేకంగా రెండు, మూడు సంవత్సరాలు ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారు. దీంతో చాలా మంది అర్హులైన పోలీసు ఉద్యోగులు ప్రమోషన్లు పొందలేకపోతున్నారు. పదవీ విరమణ చేసిన వారికి రీఎంప్లాయ్‌మెంట్ కల్పించినట్లయితే, వారికి కన్సల్టెంట్‌లుగా, సలహాదారులుగా మాత్రమే నియమించాలి. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా రెగ్యులర్ పోస్టింగ్స్ ఇస్తూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.

తమ పార్టీలో కీలక నాయకులుగా పనిచేస్తున్న కొంతమందిని ఇంకా ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కొనసాగిస్తూ, కేసీఆర్ ఆయా సంఘాలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తుండ్రు. అదే పరిణామం పోలీసుల విషయంలో జరిగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మన ఖాకీ యూనిఫారంకి త్యాగాలతో కూడుకున్న చరిత్ర ఉంది. అంతటి పవిత్రమైన పోలీసు వ్యవస్థను తాత్కాలికమైన తమ స్వార్థ రాజకీయాల కోసం భగ్నం చేయడం దార్శనికత అనిపించుకోదు.

పాలకులు, ప్రభుత్వాలు, రాజకీయాలు తాత్కాలికం, కానీ వ్యవస్థలు శాశ్వతం. తమ నియంతృత్వాన్ని కొనసాగించేందుకు కీలకమైన వ్యవస్థల్ని సైతం నిర్వీర్యంచేసే విధంగా పాలకులు వ్యవహరిస్తే, భావి తరాలకు అన్యాయం చేసినట్లే.

డాక్టర్ శ్రవణ్ దాసోజు
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్

http://www.andhrajyothy.com/artical?SID=417753

No comments:

Post a Comment