Tuesday 2 January 2018

ఉద్యమానికి ఊపిరిగా మారిన పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తమన్న కేసీఆర్‌, ఇప్పుడా ఊసే లేకుండా, ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్వహించి ఎవరిని మెప్పించినట్లు?

అందెశ్రీ పాటకు పట్టం కట్టరా?


కర్ణాటక, తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర గీతం, రాష్ట్ర పతాకాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవిస్తున్నా.. మనమెందుకు మన రాష్ట్ర గీతాన్ని పాడుకోలేక పోతున్నం? నాలుగుకోట్ల మంది నాలుకలపై నాట్యమాడి, ఉద్యమానికి ఊపిరిగా మారిన పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తమన్న కేసీఆర్‌, ఇప్పుడా ఊసే లేకుండా, ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్వహించి ఎవరిని మెప్పించినట్లు?
సబ్బండ కులాలు, వర్గాలు, సకల జనులు సమైక్యంగా చేసిన మహోన్నత పోరాటమే తెలంగాణ ఉద్యమం. లోతుగా విశ్లేషిస్తే సమస్త తెలంగాణ ఉద్యమం దళిత బహుజనుల గుండెల్లోంచి వచ్చిన సాంస్కృతిక సాహిత్య విప్లవంగా కనిపిస్తది. తమ మాటలను, పాటలను, ఆటలను కలగలిపి ఒక గొప్ప ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన దాఖలాలు బహుశా ప్రపంచ చరిత్రలోనే లేదంటే అతిశయోక్తి కాదేమో. పేదోళ్ల ఆట, పాట, మాట కలబోసి ఆత్మగౌరవ పోరాటమైతే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.
తెలంగాణ అస్తిత్వ పోరాటానికి, ఆత్మగౌరవానికి జానపద గేయాలు, దళిత బహుజన కవిత్వం, సాహిత్యం ప్రాణం పోశాయన్నది వాస్తవం. వారే స్వయంగా గజ్జెకట్టి, గోశిపోసి, గొంతులు సవరించుకున్నారు. ఆడి, పాడి సకల జనులను ఉత్తేజపరిచిన్రు. నాటి పాటల సేనానులు సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, గద్దర్, గూడ అంజయ్యల నుంచి నేటి జయరాజ్, గోరటి వెంకన్న, అందెశ్రీ, విమలక్క, నేర్నాల కిషోర్, రసమయి, మిట్టపల్లి సురేందర్, పసునూరి రవీందర్, ఏపూరి సోమన్నల వరకు ఎందరో దళిత బహుజన కవులు తెలంగాణ భాష, యాస, సంస్కృతి ప్రతిబింబించేలా పోరాటపటిమతో సామాజిక సమస్యలను, అణచివేతను ఎత్తిచూపుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిండ్రు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను జానపద పాటల రూపంలో పదునైన ఆయుధాలుగా మార్చి పాలకుల గుండెల్లోగుచ్చుకునేలా చేశారు. ‘‘దెబ్బకు దెబ్బ వెయ్యి, వెయ్యిర.. వెయ్యీ’’ అని ఎలుగెత్తి పాడిన సుద్దాల హనుమంతు, ‘‘బండెనుక బండిగట్టి, పదహారు బండ్లు గట్టి, ఏ బండ్ల వస్తవు కొడుకో’’ అంటూ పోరాటానికి సైరనూదిన బండి యాదగిరి, దొరల దోపిడీని, అణిచివేతను నిరసిస్తూ ‘‘దొరఏందిరో వాని పీకుడేందిరో’’ అని గూడ అంజన్న రాసిన తూటాల్లాంటి పాటలు ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి నిరంకుశత్వాన్ని సునిశితంగా ప్రశ్నించాయి. తెలంగాణ సమాజమంతటిని కార్యోన్ముఖులను చేసి ఉద్యమ ఉధృతిని రాష్ట్ర ఎల్లలు దాటించి, దేశ, విదేశాల్లో మార్మోగిపోయేలా చేశాయి. ‘‘బరిగీసి బడితందుకోర రాజన్న ఒరె రాజన్న, తెలంగాణ రాకుంటె ఒట్టు... రాజన్న మా రాజన్న’’ అంటూ ఉద్యమం విఫలమవుతున్నప్పుడల్లా... తెలంగాణ వచ్చి తీరుతుందన్న అపారమైన విశ్వాసాన్ని కల్పించిన మట్టి మనుషుల సాహిత్యం మనది.
తెలంగాణ ఆడబిడ్డలు విమలక్కతో సహా అనేక మంది సివంగుల్లా, గోచిపోసి, గజ్జెకట్టి, ధూంధాం వేదికల మీద ఫిరంగి తూటాల్లాంటి తమ పాటలతో ఆడిపాడారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతను పెంచేందుకు కారణమయిన్రు. బంగారు తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయనుకున్నరు.
‘‘అయ్యోనివా.... నువ్వు అవ్వోనివా’’ అంటూ ఆంధ్రా పెట్టుబడిదారుల దోపిడీని నిలదీసినతీరు; ‘‘చార్మినారుకు సున్నమేసినవా... గోలుకొండకు రాళ్లు మోసినవా’’ అంటూ హైదరాబాద్ అంతా మేమే అభివృద్ధి చేశామన్న ఆంధ్ర పెత్తందార్లను సునిశితంగా విమర్శించి, ప్రశ్నల వర్షం కురిపించి దళిత బహుజన కవిత్వం యావత్ తెలంగాణ సమాజానికి అండగా నిలబడ్డది.
అసలు తెలంగాణ ఉద్యమమే దళిత బహుజనుల ఉద్యమం.. గిరిగీసి బరిలో నిలబడి కొట్లాడింది, ప్రాణత్యాగాలకు పాల్పడ్డది దళిత గిరిజన బహుజనులు. కాని ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దళిత గిరిజన బహుజన కవులను, మేధావులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవమానిస్తున్న తీరు విచారకరం. స్వచ్ఛమైన సంస్కృతులకు నెలవైన తెలంగాణ మాగాణంలో తెలంగాణ భాషా వికాసంలో వెలుగులు పంచిన వారికి సమున్నత స్థానం కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
తమ సాహిత్యాన్ని పదునైన ఆయుధంగా మలుచుకుని ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన కవులు, సాహిత్యకారులు నేడెందుకు పనికిరాకుండా పోయారో అర్థంకావడం లేదు. పాటల తూటాలను సమైక్యవాదుల గుండెల్లో గురిపెట్టి గుబులు పుట్టించిన మట్టి మనుషుల పొడ కూడా తెలంగాణ పాలక వర్గాలకు గిట్టడం లేదు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటాలలో రామబాణాల్లా పనిచేసిన పాటలు ఇవాళ టీఆర్‌ఎస్‌ నాయకులకెందుకు గుచ్చుకుంటున్నాయి?
తెలంగాణ సాహిత్యానికి ఉద్యమ చిహ్నాలుగా తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమానికి ‘‘తెలంగాణా తల్లి’’ అస్తిత్వరూపమిస్తే, పాటలే జీవనాడులయింది నిజం కాదా? అలాంటి పాటలను, వాటిని రాసిన కవులను నామరూపాల్లేకుండా చేయాలనుకోవడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. కానీ తెలంగాణ వచ్చిన తరువాత, ఉద్యమ సాహిత్యం పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అనుచిత వైఖరి ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు చేరగానే బోడ మల్లయ్య అన్న సామెత గుర్తుకు తెస్తుంది. కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో దళిత బహుజన కవుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూపుతున్న వివక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించడమే.
అలనాడు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన వందేమాతరం పాట ఆయుధంగా మారి, బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి విముక్తి ఏవిధంగా ప్రసాదించిందో, అదే మాదిరిగా, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ వాగ్గేయకారుడు, దళిత కవి, అందెశ్రీ రాసిన ‘‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’’ పాట, తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చింది, తెలంగాణ ఆత్మ గౌరవానికి పట్టం కట్టి, వలస పాలకుల నుండి విముక్తి కలిగించింది. ఈ పవిత్రమైన పాటను రాష్ట్ర గీతంగా అమలు చేద్దామని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చెప్పిన మాటలను నమ్మి, పల్లె పల్లెల్లో, బడి పిల్లలు, ప్రభుత్వ కార్యాలయాలలో సకల జనులంతా జాతీయ గీతంతో సమానంగా పాడుకున్నారు.. సకలజనులు సైతం అదే స్ఫూర్తిగా ముందుకు కదిలి రాష్ట్రం సాధించుకున్నరు. కానీ గడిచిన మూడున్నరేళ్లుగా ‘‘జయ జయహే తెలంగాణ’’ ఉద్యమగీతాన్ని మరుగున పెట్టిండ్రు. కేవలం టీఆర్‌ఎస్‌ను స్తుతించే విధంగా, జయ జయహే గీతంలో మార్పులు, చేర్పులు, కూర్పులు చేయాలన్న ముఖ్యమంత్రి కోరికను అందెశ్రీ తిరస్కరించడంతో, మొత్తం జనంగుండెల్లో గూడుకట్టుకున్న పాటనే పాతరేసిండ్రని తెలంగాణ యావత్తు కోడై కూస్తుంది. అదే నిజమైతే తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనవాడనుకున్న ముఖ్యమంత్రే స్వయంగా అణచివేసినట్లే.
కర్ణాటక, తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర గీతం, రాష్ట్ర పతాకాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవిస్తున్నా.. మనమెందుకు మన రాష్ట్రగీతాన్ని పాడుకోలేక పోతున్నం? నాలుగుకోట్ల మంది నాలుకలపై నాట్యమాడి, ఉద్యమానికి ఊపిరిగా మారిన పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తమన్న కేసీఆర్‌, ఇప్పుడా ఊసే లేకుండా, ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్వహించి ఎవరిని మెప్పించినట్లు?
ఉద్యమ సాహిత్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ఘోరమైన అపరాధం. గొప్పసాహిత్య అభిమానినని తరుచూ చెప్పుకునే ముఖ్యమంత్రి ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు గద్దర్, విమలక్క, అందెశ్రీ, ఉద్యమ కవులను ఆహ్వనించకపోవడం తీరని అన్యాయం.
తెలుగు మహాసభల్లో జరిగిన తప్పును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని ఆకాంక్షిస్తూ, ఇకనైనా బేషజాలు వీడి ‘‘జయ జయహే తెలంగాణ’’ అంటూ జంగ్ సైరన్ మోగించి గల్లీనుంచి ఢిల్లీ దాకా దద్దరిల్లేలా చేసిన అందెశ్రీ పాటకు పట్టం కట్టాలని, కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, విజ్ఞప్తి. అంతేకాదు, దళిత బహుజన ఉద్యమ కవుల రచనలను, అమరుల ఆత్మత్యాగాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. తెలంగాణ రాష్ట్రం అలుపెరుగని పోరాటం, అనన్య త్యాగాల ఫలమన్న సత్యాన్ని, భవిష్యత్తు తరాలకు అందించేలా చర్యలు తీసుకోవాలి.
ఉద్యమ సాహిత్యాన్ని, తెలంగాణ నుంచి వేరుచేయడమంటే ‘‘తల్లి నుంచి పిల్లను వేరుచేయడం లాంటిదే’’ననే నగ్నసత్యాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలి. తెలంగాణ జాతిని ఆత్మ న్యూనత భావం నుండి తల ఎత్తుకుని ఆత్మ గౌరవంతో నిలబడి వలస పాలకులతో కలబడేందుకు బలాన్నిచ్చిన ‘‘జయజయహే తెలంగాణ’’ గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించి గౌరవించాలి.
లేనిపక్షంలో వందేమాతర నినాదంతో నడిచిన స్వాతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, యావత్ తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి ‘‘జయ జయహే తెలంగాణ’’ ఉద్యమాన్ని నిర్మిస్తాం. సామాజిక తెలంగాణకు బాటలు వేస్తాం.
డాక్టర్‌ శ్రవణ్ దాసోజు
ముఖ్య అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్